Teach Tool Training : జిల్లాస్థాయి టీచ్ టూల్ శిక్షణ తరగతులు ప్రారంభం..
గుంటూరు: ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రపంచ బ్యాంకు సహకారంతో ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టీచ్ టూల్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. బోయపాలెంలోని డైట్ కళాశాల, తెనాలిలోని సెయింట్ జాన్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సందర్శించిన ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు.
మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి పర్చడంతోపాటు విద్యార్థి కేంద్రంగా బోధనా పటిమను తీర్చిదిద్దేందుకు శిక్షణా కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై రిసోర్స్‌పర్సన్లు శిక్షణ కల్పించారు. బోయపాలెం డైట్ కళాశాలలో 120 మంది, తెనాలిలో 115 మంది చొప్పున ఉపాధ్యాయులకు ఈనెల 27 వరకు శిక్షణా శిబిరం జరగనుందని లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ ఇన్‌చార్జ్ తోట వీరయ్య తెలిపారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సలీంబాషా, సీనియర్ అధ్యాపకులు సుభానీ పాల్గొన్నారు.