TREIRB Gurukulam Jobs Results 2024 : ఏక్షణంలోనైన 9,210 గురుకుల ఉద్యోగాల ఫలితాలు విడుదల.. కానీ సమస్య ఇదే..!
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ గురుకులం ఫలితాలను రానున్న రెండు రోజుల్లో ఏక్షణంలోనైన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు (TREIRB) ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు నుంచి స్పష్టత రాగానే.. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది. ఆ తర్వాత వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక జాబితాను వెల్లడించనుంది.
మహిళలకు సమాంతర రిజర్వేషన్లు..
ఫలితాల వెల్లడి నుంచి నియామక పత్రాల అందజేత వరకు దాదాపు మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సరంలోగా నియామకాలు పూర్తిచేసి.. పోస్టింగులు ఇవ్వాలని TREIRB బోర్డు లక్ష్యంగా అడగులు వేస్తోంది. గురుకుల పోస్టులకు సంబంధించి ఖాళీల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించింది.గురుకుల పోస్టుల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి స్పష్టత రాగానే మొదట డిగ్రీ లెక్చరర్లు (DL), తర్వాత జూనియర్ లెక్చరర్లు (JL), పీజీటీ(PGT) పోస్టుల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు.
☛ APPSC Group 2 Best Books List : ఈ సిలబస్ చదివితే ఉద్యోగం ఈజీనే.. |ముఖ్యమైన ప్రశ్నలు ఇవే..
అత్యధికంగా..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు..
ఫలితాల విడుదల తర్వాత.. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశముందని సమాచారం. ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.