Mega Job Mela 2025 : మెగా జాబ్‌మేళా.. 48 కంపెనీలు.. 12,220 ఉద్యోగాలు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో నిర్వహించిన మెగాజాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది.

పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ జాబ్‌మేళాను సీజీఎంఎం స్పెషల్‌ కమిషనర్‌ సీఈఓ బి.షఫీఉల్లా, కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. 

☛➤ World Highest Paid Salary Job : రోజుకు జీతం రూ.48 కోట్లు.. ఏడాదికి రూ.17000 కోట్లు ప్యాకేజీ.. ఇత‌ను ఎవ‌రంటే...?

రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా..
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... పలు కంపెనీల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జిల్లాలో మెగా జాబ్‌మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించవద్దన్నారు. ఆయా కంపెనీలలో కష్టపడుతూ ఉన్నత స్థాయికి చేరుకుని మరో నలుగురికి అవకాశం కల్పించాలన్నారు. కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగ వేటలో ఉంటూనే వ్యవసాయం, వ్యాపార రంగంపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

12,220 ఉద్యోగాల భర్తీ..

ఈ జాబ్‌మేళాలో 12,220 ఉద్యోగాల భర్తీ కోసం.. 48 కంపెనీలు పాల్గొన్నాయి. ములుగు మండలం నుంచి 377 మంది, వెంకటాపురం(ఎం) నుంచి 260 మంది, గోవిందరావుపేట నుంచి 370 మంది, ఎస్‌ఎస్‌తాడ్వాయి నుంచి 196 మంది, ఏటూరునాగారం నుంచి 202, వాజేడు నుంచి 256, వెంకటాపురం(కె) నుంచి 235, మంగపేట మండలం నుంచి 267, కన్నాయిగూడెం నుంచి 68 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. జిల్లా వ్యా ప్తంగా మొత్తంగా 2,231 మంది యువతీ యువకులు తమ పేర్లను రిజస్టర్‌ చేయించుకున్నారు.

ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే..
ములుగు జిల్లా పరిధిలోని వివిధ ఉద్యోగాలకు 416మందిని ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేసుకున్నారు. అలాగే 1,110 మంది యువతీ యువకులను ఇంటర్వ్యూ నిర్వహించి పలు ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అలాగే మరో 910 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసి ట్రైనింగ్‌ ఇచ్చిన తర్వాత అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకం పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన సీఈఓలు, అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, ఎల్‌డీఎం జయప్రకాశ్‌, జిల్లా అదికారులు పాల్గొన్నారు.

#Tags