AP Schools 2 Days Holidays Due to Heavy Rain : బ్రేకింగ్ న్యూస్‌.. ఏపీలో భారీ వర్షాలు.. రెండు రోజులు స్కూల్స్ బంద్.. తెలంగాణ‌లో కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లుచోట్ల‌ ఆనకట్టలు. రోడ్లు భారీగా దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు.

వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

☛ AP IIIT Counselling Dates 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్ 2024-25 తేదీలు ఇవే.. మొత్తం ఉన్న సీట్లు ఇవే..

దీంతో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు స్కూల్స్‌కు రెండు రోజులు పాటు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. ఈ వ‌ర్షాలు ఇలాగే ఉంటే.. ఈ స్కూల్స్ సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఏలూరు కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. 

గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి.. 
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను..

లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రత అధికంగా ఉంది. గురువారం ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరిచేలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో.. రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని స్థానికులు కాపాడారు. ఆంధ్రా-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల మేర గండి పడింది. ఈ ప్రభావం ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై పడింది. ఇప్పటికే వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, అల్లూరినగర్, రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. గండి కారణంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి కొన్ని గ్రామాలు నామరూపాల్లేకుండా పోతాయన్న ఆందోళన నెలకొంది. పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. 

చదవండి: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఈ సమస్యలే కారణం!!

రాయలసీమల్లో కూడా..
కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ సూచించారు. 

తుంగభద్రకు వరద ఉద్ధృతి పెరిగింది. బుధవారం సుమారు 80 వేల క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో గురువారం సాయంత్రానికి 1.12 లక్షలకు చేరింది. ఫలితంగా ఒకేరోజులో జలాశయంలో ఏడు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. శివమొగ్గలోని తుంగ జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహం తుంగభద్రను చేరుకుంటోంది. భద్రావతిలోని భద్ర జలాశయమూ ఏ క్షణంలోనైనా నిండనుంది.

తెలంగాణ‌లో కూడా ‘ఐఎండీ’ రెడ్‌ అలర్ట్‌..

తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌  జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపెల్లి  జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ  జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే తెలంగాణ‌లోని ఈ జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవు ఇచ్చే అవ‌కాశం ఉంది.

బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని  హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.

➤☛ Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

#Tags