Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు

ప్రవేశిక - విమర్శనాత్మక పరిశీలన
వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు

రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి వర్సెస్‌ యూనియన్‌ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. ఈ సందర్భంలో ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వక అభిప్రాయాన్ని చెప్పింది. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పునిస్తూ దీనికి పూర్తి భిన్నంగా.. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా కేసులో కూడా అత్యున్నత ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు కూడా 'ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం' అని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.

చ‌ద‌వండి: Constitution of India Notes for Competitive Exams: అర్ధరాత్రి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ..

ప్రవేశిక ప్రయోజనం

ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి.

ప్రయోజనాలు

  • ఇది రాజ్యాంగ ఆధారాలను తెలుపుతుంది.
  • రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది.
  • రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది.

విమర్శ

  • ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు పరచకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు.
  • ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు.
  • హక్కుల ప్రస్తావన లేదు.
  • శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు.
  • సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని చెప్పవచ్చు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీ హాజ‌ర‌య్యాడు?

ప్రవేశిక - పరిశీలన

భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా పరిగణిస్తున్న ప్రవేశిక ప్రాముఖ్యంపై భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పొందుపర్చిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటిని అమలుపరచాలని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ ఆశయాలకు ఆచరణ లేదా అమలు చేయకపోవడం వల్ల వాటి సార్థకతపై తీవ్ర విమర్శ ఉంది. అయితే రాజ్యాంగంలోని ప్రకరణల భావం లేదా ఆచరణీయతపై సక్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రవేశికకు స్వతంత్రంగా ప్రాముఖ్యం లేకపోయినా, ఇందులోని ఆదర్శాలను అమలు చేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..

ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు

  • ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం (Political Horoscope) -కె.యం. మున్షీ
  • రాజ్యాంగంలో ప్రవేశిక అత్యంత పవిత్ర మైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ. రాజ్యాంగానికి తాళంచెవి లాంటిది. - పండిట్‌ ఠాకూర్‌దాస్‌ భార్గవ
  • రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది.    - ఎం.ఎ. నాని పాల్కీవాలా
  • రాజ్యాంగానికి ప్రవేశిక కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను. - సర్‌ ఎర్నస్ట్‌ బార్కర్‌
  • ప్రవేశిక మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
  • భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటన మాదిరిగానే రాజ్యాంగ ఆత్మ. రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు. - జస్టిస్‌ హిదయతుల్లా
  • ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ. - నెహ్రూ
  • రాజ్యాంగ ప్రాధాన్యాల లక్షణ సారం ప్రవేశిక. - మథోల్కర్‌
  • ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిది.- జె. డయ్యర్‌
  • ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు, అలాగే పరిమితి కాదు. - సుప్రీంకోర్టు
ప్రవేశిక - సుప్రీంకోర్టు తీర్పులు వివాదం సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు సారాంశం
ఎ.కె. గోపాలన్‌ కేసు 1950 ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని,పరిధిని నియంత్రిస్తుంది.
బెరుబారి వర్సెస్‌ యూనియన్‌ కేసు 1960  ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు.
గోలక్‌నాథ్‌ కేసు 1967 ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మ రూపం.
కేశవానంద భారతి కేసు 1973 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పరిమితంగా సవరించవచ్చు.
ఎక్సెల్‌ వేర్‌ కేసు 1979 సామ్యవాదం పద నిర్వచనం.
నకారా కేసు 1983 సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజం కలయిక.
ఎస్‌.ఆర్‌.బొమ్మాయ్‌ కేసు 1994 లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది.
ఎల్‌.ఐ.సి. ఆఫ్‌ ఇండియా 1995 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
అశోక్‌కుమార్‌ గుప్తా కేసు 1997 సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు.
అరుణా రాయ్‌ కేసు 2002 విద్యా సంస్థల్లో మత విలువల బోధన లౌకికతత్వానికి వ్యతిరేకం కాదు.

 

కమిటీలు - వివరాలు జనరల్‌ నాలెడ్జ్‌ ఫర్‌ గ్రూప్స్‌

కమిటీ అధ్యక్షుడు/ చైర్మన్‌ పరిశీలన అంశం
మోహన్‌ కమిటీ జస్టిస్‌ మోహన్‌ ప్రభుత్వరంగ సంస్థల స్థితిగతులపై 
ఎంపీ లాడ్స్‌ కమిటీ వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ ఎంపీలాడ్స్‌ అవకతవకల విచారణకు
ముఖర్జీ కమిటీ ముఖర్జీ  కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి
మల్హోత్రా కమిటీ ఆర్‌.ఎస్‌. మల్హోత్రా బీమారంగ సంస్కరణల సమీక్ష కోసం
లింగ్డో కమిటీ జేఎం లింగ్డో విద్యార్థి సంఘాల ఎన్నికల సక్రమ నిర్వహణకు సంబంధించింది

గతంలో అడిగిన ప్రశ్నలు

#Tags