Skip to main content

Constitution of India Notes for Competitive Exams: అర్ధరాత్రి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ..

Jawaharlal Nehru

నడిరాత్రి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నపుడు భారతదేశం మేల్కొని ఊపిరిని, 
స్వేచ్ఛను పొందుతుంది. భారతదేశ ప్రజలు విశాల మానవాళి సేవ కోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో ఆవశ్యకం. భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ. 
-నెహ్రూ.

భారత రాజ్యాంగం  చారిత్రక నేపథ్యం
సి.ఆర్‌. ఫార్ములా (1944) (సి. రాజగోపాలాచారి సూత్రం)

ముస్లిం లీగ్‌ సహకారం కోసం, మతసమస్యల పరిష్కారం కోసం 1944 మార్చిలో గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్‌ తరఫున సి.రాజగోపాలాచారి ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్‌ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావాల్సిన స్వతంత్ర సాధన, దాని కోసం ముస్లింల సహకారాన్ని పొందేందుకు ఎంత నష్టాన్నైనా భరించటానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. ముస్లిం లీగ్‌ మాత్రం దేశ స్వాతంత్య్రం గురించి పట్టించుకోకుండా, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనకు అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: రాజ్యాంగ వికాసంలో భాగమైన చట్టాలు..

వేవెల్‌ ప్రణాళిక (1945) 

భారత వైస్రాయ్, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వేవెల్‌ నాటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.

ముఖ్యాంశాలు

  • భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించిన వారికి సముచిత ప్రాతినిధ్యం కోసం వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిని విస్తరించడం.
  • భారతదేశంలోని బ్రిటిష్‌ వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమిషనర్‌ను నియమించడం.
  • వైస్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారిగా భారతీయుడిని నియమించడం.
  • వైస్రాయ్‌ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం. దీని కోసం వైస్రాయి 1945 జూలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ కాంగ్రెస్‌ అవిభాజ్య భారతదేశం (యునైటెడ్‌ ఇండియా) కోసం పట్టుబట్టింది. ముస్లిం లీగ్‌ మాత్రం దేశ విభజనను సమర్థించింది.

కేబినెట్‌ మిషన్‌ (1946) (కేబినెట్‌ రాయబారం)

బ్రిటన్‌ ప్రధాని అట్లీ్ల.. 1946 మార్చిలో పార్లమెంటులో భారతదేశానికి అధికార బదిలీకి సంబంధించి ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. 'అల్ప సంఖ్యాకుల హక్కులపై మాకు అవగాహన ఉంది. అల్పసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయితే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్ప సంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేం' అని పేర్కొన్నారు.అందులో భాగంగా బ్రిటన్‌లో కేబినెట్‌ మంత్రులైన సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్, లార్డ్‌ పెథిక్‌ లారెన్స్‌ సభ్యులుగా మంత్రుల బృందం భారత పర్యటన ప్రారంభించింది. ఈ బృందానికి సర్‌ పెథిక్‌ లారెన్స్‌ నేతృత్వం వహించారు. 1946 మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.

ముఖ్యాంశాలు

  • బ్రిటిష్‌ పాలిత భారతదేశం,స్వదేశీ సం స్థానాలు, ఇండియన్‌ యూనియన్‌ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ యూనియన్‌ విదేశీ వ్యవహారాలు,రక్షణ, కమ్యూనికేషన్‌ లాంటి జాతీ య ప్రాముఖ్యం ఉన్న అంశాలను నిర్వహిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
  • ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పడుతాయి. పరిపాలనా నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
  • పాకిస్తాన్‌ అనే మరొక దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు.
  • రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీ హాజ‌ర‌య్యాడు?

తాత్కాలిక ప్రభుత్వం (1946)

బ్రిటిష్‌ ప్రభుత్వం 1946 ఆగస్టు 24న∙తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. దీనికి అనుగుణంగా 1946 సెప్టెంబర్‌ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్, 1946 అక్టోబర్‌ 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్‌ తరఫున వల్లభాయ్‌æపటేల్, రాజేంద్ర ప్రసాద్, అరుణా అసఫ్‌ అలీ, రాజగోపాలాచారి, జగ్జీ్జవన్‌రామ్‌ లాంటి ప్రముఖులు, ముస్లిం లీగ్‌ తరఫున లియాఖత్‌ అలీఖాన్, జె.ఎన్‌.మండల్, గజ్నేఫర్‌ అలీఖాన్‌ లాంటి నాయకులు మంత్రులుగా, జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.

అట్లీ్ల ప్రకటన (1947)

1947 ఫిబ్రవరి 20న కామన్స్‌ సభలో మాట్లాడుతూ 1948 జూన్‌ నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశం నుంచి వైదొలుగుతుందని ప్రకటించారు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా మహాత్మాగాంధీ వర్ణించారు.

మౌంట్‌బాటన్‌ ప్రణాళిక(1947)

భారతదేశ రాజ ప్రతినిధి, గవర్నర్‌ జనరల్‌ గా నియమితుడైన మౌంట్‌బాటన్‌ దేశంలోని రాజకీయ ప్రముఖులతో సంప్రదింపులు జరిపి, సమైక్య భారతదేశ ప్రాతిపదికన కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ పార్టీల మధ్య అంగీకారం కుదర్చడం సాధ్యం కాదనీ, దేశ విభజన ఒక్కటే పరిష్కారంగా భావించి ప్రణాళిక తయారు చేశారు.

ముఖ్యాంశాలు

  • ఇండియన్‌ యూనియన్‌ను భారత్, పాకిస్తాన్‌ అనే రెండు రాజ్యాలుగా విభజిస్తారు.
  • 1948 జూన్‌కు బదులుగా 1947 ఆగస్టు 15 న రెండు దేశాలుగా విడిపోతాయి.
  • అసోం భారత్‌లో అంతర్భాగంగా ఉండగా బెంగాల్, పంజాబ్‌లను మత ప్రాతిపదికన విభజించారు. అయితే ముస్లింలు అధి కంగా ఉండే సిల్హట్‌(బెంగాల్‌) జిల్లా విషయంలో మాత్రం అది తూర్పు బెంగాల్‌లో లేదా అసోంలో చేరడమా అనే విషయం ప్ర జాభిప్రాయ సేకరణ ద్వారా జరుగుతుంది.
  • బెలూచిస్థాన్‌ వాయవ్య ప్రాంతాలు భారత్‌ లేదా పాకిస్తాన్‌లో కానీ చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
  • పంజాబ్, బెంగాల్, అసోం లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను విభజించే విషయంలో రెండు సరిహద్దు సంఘాలను నియమించారు.
  • బ్రిటన్‌ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్‌ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్తాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

ప్రముఖుల వ్యాఖ్యానాలు

 మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్‌ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు,వారి చారిత్రక సంప్రదాయాలు కూడా కొద్దో,గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి.
- డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

భారత స్వాతంత్య్ర చట్టం (1947)

భారతదేశ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ కోసం రూపొందించిన చివరి చట్టం ఇదే. బ్రిటన్‌ ప్రధాని క్లిమెంట్‌ అట్లీ ఆధ్వర్యంలో భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటన్‌ సలహా మేరకు 1947 జూలై 4న బ్రిటిష్‌ పార్లమెంటులో భారత స్వాతంత్య్ర ముసాయిదాను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బ్రిటిష్‌ రాణి 1947 జూలై 18 న సంతకం చేసింది. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు

  • ఇండియా, పాకిస్తాన్‌ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడతాయి. వీటికోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటవుతాయి. 
  • స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్‌ సార్వభౌమాధికారంతోపాటు భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దవుతుంది.
  • బ్రిటిష్‌ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
  • వైస్రాయ్‌ పదవి రద్దు అవుతుంది.
  • రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసి చట్టాలను రూపొందిస్తుంది.
  • గవర్నర్‌ జనరల్, రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగ పరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు. ∙లార్డ్‌ మౌంట్‌బాటన్‌ మొదటి గవర్నర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Indian Polity Bit Bank For All Competitive Exams: భారతదేశ పాలన బ్రిటిష్‌ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?

Published date : 30 Aug 2022 06:47PM

Photo Stories