Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

కరెంట్‌ అఫైర్స్‌.. లేదా సమకాలీన అంశాలు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో సుపరిచితమైన విభాగం! సివిల్స్, గ్రూప్‌1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, పోలీస్, బ్యాంకింగ్‌ మొదలు గ్రూప్‌ 4 వరకూ.. అన్ని ఉద్యోగ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ కీలకంగా మారుతోంది. ఆయా పోటీ పరీక్షల్లో.. కోర్‌ అంశాల కలయికతో కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీస్, గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే!! ఈ నేపథ్యంలో.. గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ ప్రాధాన్యం, వాటిపై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం..
  • ఉద్యోగ నియామక పరీక్షల్లో కీలకంగా మారుతున్న కరెంట్‌ అఫైర్స్‌
  • గ్రూప్‌-1 మొదలు గ్రూప్‌-4 వరకు కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం
  • ముఖ్య అంశాల గుర్తింపే కీలకం అంటున్న సబ్జెక్ట్‌ నిపుణులు

కరెంట్‌ అఫైర్స్‌.. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకున్న అవగాహన తెలుసుకునేందుకు ఉద్దేశించిన విభాగం ఇది. గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకూ..అదే విధంగా సివిల్‌ సర్వీసెస్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ వంటి పోటీ పరీక్షల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మేరకు కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించాలనుకునే వారికి సామాజిక, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమే కరెంట్‌ అఫైర్స్‌ అంటున్నారు నిపుణులు. 

కోర్‌ + సమకాలీనం

కొంతకాలంగా కరెంట్‌ అఫైర్స్‌ నుంచి అడుగుతున్న ప్రశ్నల తీరు మారుతోంది. నేరుగా కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు మాత్రమే కాకుండా.. కోర్‌ అంశాలతో సమ్మిళితం చేస్తూ కూడా అధిక సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కొత్త బిల్లులు లేదా ఆర్డినెన్స్‌లు తెస్తున్న విషయం తెలిసిందే. సదరు బిల్లులకు సంబంధించి సమకాలీన పరిణామం, దాని నేపథ్యం,బిల్లు ప్రవేశపెట్టేందుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలిస్తేనే.. సమాధానం ఇవ్వగలిగేలా కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు తాజా పరిణామాలతోపాటు కోర్‌ సబ్జెక్ట్‌లోని మూల భావనలపైనా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

విస్తృత విభాగం

కరెంట్‌ అఫైర్స్‌ అనేది ఒక సముద్రం లాంటిది. ప్రతి రోజు ఎన్నో కొత్త పరిణామాలు సంభవిస్తుంటాయి. జాతీయం,అంతర్జాతీయం,సైన్స్, స్పోర్ట్స్‌.. ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా.. ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వీటిలో పరీక్షల కోణంలో ముఖ్యమైనది ఏదో గుర్తించడం ఎలా.. అనే ప్రశ్న అభ్యర్థులకు ఎదురవుతోంది. ఇలాంటి అభ్యర్థులు విస్తృత ప్రాధాన్యం, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతీయ సంఘటనలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత అంశం నేపథ్యాన్ని పరిశీలించాలి. అలాగే ఆర్థిక, సామాజిక,విద్య, పరిపాలన ప్రాధాన్యం కలిగిన జాతీయ అంశాలను ముఖ్యమైనవిగా పరిగణించాలి.

చదవండి: Current Affairs Practice Tests(TM)

అంతర్జాతీయ అంశాలు

అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన వాటిపై దృష్టిపెడితే సరిపోతుంది. ఉదాహరణకు.. సదస్సులు, సమావేశాలకు సంబంధించి ప్రతిదానికి తేదీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సదస్సుల్లో విడుదల చేసిన డిక్లరేషన్లను, 'వాటి థీమ్‌' ను నోట్‌ చేసుకోవాలి. అదే విధంగా ఆయా సదస్సుల నిర్వహణ ఉద్దేశం తెలుసుకోవాలి.
మన దేశానికి, ఇతర దేశాలకు మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో మన దేశానికి ఒనగూరే ప్రయోజనాలు, అంతర్జాతీయంగా లభించే గుర్తింపు వంటి అంశాలను తెలుసుకోవాలి. వాస్తవానికి కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో..'జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు' అని సిలబస్‌లో పేర్కొంటున్నారు. ఆ 'ప్రాధాన్యం' ఉన్న అంశాలను గుర్తించే నేర్పును అభ్యర్థులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే ప్రతి సమావేశాన్ని, లేదా సంఘటనను చదువుకుంటూ వెళ్లకుండా.. అవి చూపే ప్రభావం, వాటి ప్రయోజనం, ఉద్దేశం ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలి. 

చదవండి: Current Affairs Practice Tests(EM)

నివేదికలు, గణాంకాలు

తాజాగా విడుదలయ్యే నివేదికలు,గణాంకాలకు సంబంధించి ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశాలపై ముందుగా దృష్టిపెట్టాలి. తర్వాత ఆ నివేదికలను విడుదల చేసిన సందర్భాన్ని గుర్తించాలి. ఉదాహరణకు..కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికల్లో.. మహమ్మారి కారణంగా మన దేశంపై పడిన ప్రభావం, జీవనోపాధి, వలస కూలీల పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ వంటి కీలక అంశాలను చదివితే సరిపోతుంది. ఇలా చదివే సమయంలో సంబంధిత గణాంకాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఇది ప్రిపరేషన్‌ చివర్లో, పరీక్షకు ముందు రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

కాల పరిమితి

పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని అన్ని ముఖ్య పరిణామాలపై పట్టు సాధించాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్‌ 15 నుంచి అంతకుముందు ఏడాది కాలంలోని పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.

చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

పుస్తకాల ఎంపిక

కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌లో పుస్తకాల ఎంపిక కూడా కీలకంగా నిలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి విస్తృతమైన మెటీరియల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అది కొత్త అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడం సహజం. కాబట్టి అభ్యర్థులు గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ట్రెండ్‌ తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా సమకాలీన పరిణామాలున్న పుస్తకాలను ఎంచుకోవాలి.

చదవడమూ భిన్నంగా

ప్రామాణిక పుస్తకాలను సేకరించాక.. ఆయా కరెంట్‌ టాపిక్స్‌ను చదవడంలోనూ విభిన్నంగా వ్యవహరించాలి. చాలామంది అభ్యర్థులు సదరు అంశాలను మూసధోరణితో, నవలగానో లేదా కథగానో చదువుకుంటూ ముందుకు వెళతారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక అంశం చదవడం ప్రారంభించినప్పుడే.. ఆ టాపిక్‌ ఉద్దేశం, ప్రాధాన్యతల గురించి తెలుసుకోవాలి. ముఖ్యాంశాలను, ఘట్టాలను, కీలక తేదీలను షార్ట్‌ నోట్స్‌లో రాసుకోవాలి. దాన్ని తరచూ రివైజ్‌ చేస్తుండాలి. 

చదవండి: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుస‌రిస్తే..!

పేపర్‌ రీడింగ్‌.. ప్రత్యేక పద్ధతి

కరెంట్‌ అఫైర్స్‌ విషయంలో ఎక్కువ మంది అభ్యర్థులు దినపత్రికలపై ఆధారపడుతుంటారు. ప్రతి రోజు పేపర్‌ చదువుతూ ముఖ్య సంఘటనల గురించి అవగాహనకు ప్రయత్నిస్తుంటారు. పేపర్‌ రీడింగ్‌ విషయంలోనూ ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి.సమకాలీన అంశాలపై ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన వ్యాసాలు చదివేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాటి సారాంశాన్ని ముఖ్యమైన పాయింట్ల రూపంలో నోట్స్‌లో రాసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను గుర్తించే నైపుణ్యం పెంచుకోవాలి.

చదవండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

సొంత నోట్స్‌

కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సంఘటనలను సొంత నోట్స్‌లో రాసుకోవాలి. ఒక టాపిక్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను రాసుకునే క్రమంలో..భవిష్యత్తుల్లో పునశ్చరణకు ఉపయోగపడేలా రూపొందించుకోవాలి. పుస్తకంలో లేదా న్యూస్‌ పేపర్స్‌లో కనిపించే సమాచారం మొత్తాన్ని నోట్స్‌లో పొందుపర్చకుండా.. వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షిప్తంగా రాసుకోవాలి. 

మెమొరీ టెక్నిక్స్‌

కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్‌ ఉంటాయి. కొందరు విజువలైజేషన్‌ టెక్నిక్స్, కొందరు మైండ్‌ మ్యాపింగ్‌(మనసులోనే ఆయా అంశాలను ముద్రించుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. మరికొందరికి  ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా.. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు,కోర్‌ టాపిక్స్‌తో అనుసంధానం, మంచి పుస్తకాల ఎంపిక, పేపర్‌ రీడింగ్‌ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా ప్రిపరేషన్‌ సాగిస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

చదవండి: General Essays

పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌.. ముఖ్యాంశాలు

  • ప్రతి పోటీ పరీక్షలోనూ కీలక విభాగంగా కరెంట్‌ అఫైర్స్‌. 
  • దాదాపు అన్ని పరీక్షల్లోనూ 30 నుంచి 40 శాతం వెయిటేజీ. 
  • ఆయా పరిణామాలపై నోట్స్, కాన్సెప్ట్స్‌ అప్రోచ్‌తో పట్టు సాధించే అవకాశం.
  • కోర్‌ అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవాల్సిన ఆవశ్యకత. 
  • న్యూస్‌ పేపర్‌ రీడింగ్, ఎడిటోరియల్స్‌ చదవడం ఎంతో ప్రధానం.
     

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags