Competitive Entrance Exams 2023: ఒత్తిడి జయిస్తే.. విజయమే!!

అకడమిక్‌ పరీక్షలు.. ప్రవేశ పరీక్షలు. ఎగ్జామ్‌ ఏదైనా..టాప్‌ మార్కులు సాధించాలని విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు! ముఖ్యంగా పరీక్షల సీజన్‌ మొదలైందంటే.. రేయింబవళ్లు, నిద్రాహారాలు మాని పుస్తకాలే ప్రపంచంగా గడిపేస్తుంటారు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి! చదివిన అంశాలను గుర్తుంచుకోవడం ఎలా.. పరీక్ష హాల్లో గుర్తుకొస్తాయా.. పరీ„ý సరిగా రాయగలనా.. ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో మరింత ఆందోళన!! కొద్దిపాటి చిట్కాలతో ఒత్తిడిని జయించి.. పరీక్షల్లో విజయం సాధించొచ్చు అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విద్యార్థులు ఒత్తిడిని జయించి.. పరీక్షల్లో విజేతగా నిలిచేందుకు నిపుణుల సలహాలు..
  • త్వరలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు
  • ఆ వెంటనే పలు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు
  • పరీక్షల ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
  • కొద్దిపాటి చిట్కాలతో ఒత్తిడిని జయించే అవకాశం

 

  • అకడమిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు, గ్రేడ్స్‌ సాధించాలి. అప్పుడే భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి! 
  • ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో బెస్ట్‌ ర్యాంకు సొంతం చేసుకోవాలి. అప్పుడే ఆశించిన కోర్సుల్లో, కోరుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ లభిస్తుంది. 
  • నేటి విద్యార్థి లోకంలో ఇలాంటి ఆలోచనలే ఎక్కువ!! ఫలితంగా నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా సబ్జెక్ట్స్‌లో పొందిన నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పరీక్ష సమయంలో ప్రదర్శించలేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. దీనికి కారణం.. ఎగ్జామ్‌ ఫోబియా అనేది నిపుణుల అభిప్రాయం. ఈ భయాన్ని అధిగమిస్తే.. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించొచ్చు అంటున్నారు.

ఆత్మవిశ్వాసమే ఆలంబనగా

పరీక్షలంటే భయపడుతూ ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు.. దాన్ని అధిగమించేందుకు తొలి సాధ­నం.. ఆత్మవిశ్వాసం! దీనికోసం స్వీయ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షల్లో పోటీ గురించి తీవ్రంగా ఆలోచించడం, సహచరుల­తో పోల్చుకోవడం వంటివి ఒత్తిడి పెంచుతాయి. అందుకే ముందుగా విద్యార్థులు పరీక్షల గురించి అతిగా ఆలోచించడం మానేయాలి అంటున్నారు ని­పుణులు. మానసిక వైద్యుల అభిప్రాయం ప్రకారం-పోటీ,పోల్చుకోవడం..ఇవి రెండు విద్యార్థుల ఒత్తిడి­కి ప్రధాన కారణాలు! కాబట్టి విద్యార్థులు సహచరులతో పోల్చుకోవడం కంటే తమ సామర్థ్యాలపై న­మ్మకం పెంచుకుంటే సగం ఒత్తిడిని జయించినట్లే!!

చ‌ద‌వండి: TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!

ఫలితం గురించి ఆలోచనలు

ఆయా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల స్ట్రెస్‌కు మరో ప్రధాన కారణం.. ఫలితం గురించి ఆందోళన చెందడం! ఇది ఎంత మాత్రం సరికాదని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రిపరేషన్‌ సమయంలో ఫలితం గురించి ఆందోళన చెందకుండా.. సబ్జెక్ట్‌ను అవగహన చేసుకోవడంపైనే దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. చదవాల్సిన సిలబస్‌ అంశాలను క్రమ తప్పకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేస్తూ ముందుకు సాగాలి. అలా కాకుండా ఫలితం ఎలా ఉంటుందో.. టాప్‌ మార్కులు వస్తాయో లేదో అంటూ ఆందోళన చెందితే.. చదివింది కూడా మరిచిపోయే ప్రమాదం ఉంది. అది చివరకు ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రిపరేషన్‌ సమయంలో విద్యార్థులు పరీక్ష ఫలితాలు,భవిష్యత్తు పరిణామాల గు­రించి ఆలోచించడం సరికాదన్నది నిపుణుల సలహా!

ప్రాధాన్యత క్రమం

పరీక్షల ఒత్తిడిని జయించేందుకు ఉపయోగపడే మరో మార్గం.. ప్రాధాన్యత క్రమంలో సిలబస్‌ను పూర్తి చేయడం. విద్యార్థులు తొలుత తాము చదవాల్సిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో అంటే పరీక్ష కోణంలో అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, ఓ మాదిరిగా చదవాల్సినవి.. ఇలా ఒక జాబితా రూపొందించుకోవాలి. వీటితో డైలీ లేదా వీక్లీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వీలైతే వాటిని డైరీలోనో లేదా తమకు నిత్యం కనిపించే విధంగా వాల్‌ క్యాలెండర్‌లోనో నోట్‌ చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ప్రాధాన్యత క్రమం పాటించక.. అన్ని అంశాలు చదవాలనే ఆదుర్దాలో ఆందోళనకు గురవుతుంటారు. ఉదాహరణకు ఒక రోజు చదవాల్సిన నాలుగు లేదా అయిదు అంశాల్లో.. మొదట ముఖ్యమైన రెండు టాపిక్స్‌పై దృష్టిపెట్టి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత మిగతా టాపిక్స్‌ వేగంగా పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. 

తొలుత తేలికైనవి

విద్యార్థులు తాము చదవాల్సిన టాపిక్స్‌ను ఈజీ(తేలికైనవి)..మోడరేట్‌(మధ్యస్థం).. డిఫికల్ట్‌(క్లిష్టమైనవి).. అనే మూడు విభాగాలుగా వర్గీకరించుకోవాలి. తొలుత తేలికైన అంశాలతో ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ఫలితంగా మిగతా రెండు విభాగాలను (మోడరేట్, డిఫికల్ట్‌) ఎదుర్కొనే ముందస్తు సంసిద్ధత లభిస్తుంది. ఇలా కాకుండా.. పరీక్ష కోణంలో ముఖ్యమైనవి అనే భావనతో ఇష్టం లేకున్నా.. కష్టమైన అంశాలతో ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే ఒత్తిడి మరింత పెరుగుతుంది.

ప్రశాంత వాతావరణం

ఆయా పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో.. పరిసరాల ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చదివే గది వాతావరణం, పరిసరాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గదిలో టీవీ, కంప్యూటర్‌ వంటివి లేకుండా చూసుకోవాలి. అదే విధంగా.. బయటి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు సహజమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో కూర్చుంటే.. మానసికంగా, శారీరకంగా ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా.. ప్రశాంతంగా ప్రిపరేషన్‌ సాగించే వీలుంటుంది.

చ‌ద‌వండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌

పరీక్షలంటే ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే విద్యార్థులు..రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ పాటించడం మేలు చేస్తుంది. వాస్తవానికి క్లిష్టమైన అంశాలు చదువుతున్నప్పుడు.. లేదా అప్పటికే చదివిన విషయాలు గుర్తుకురానప్పుడు ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు విద్యార్థులు ఉపశమన చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. టెన్షన్‌కు గురవుతున్న భావన కలిగిన వెంటనే పుస్తకాలను కొద్దిసేపు పక్కనపెట్టేయాలి. తమకు ఇష్టమైన సంగీతం, పాటలు వినడం, లేదా యోగా, మెడిటేషన్, గార్డెనింగ్‌ వంటివి చేయాలి. కొంతమంది టీవీ చూస్తుంటారు. అలాంటి విద్యార్థులు టీవీల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిస్కషన్స్, డిబేట్స్‌ వైపు దృష్టి పెట్టకూడదు. ఇవి కొంత ఉద్రేకపూరిత వాతావరణంలో సాగుతాయి. ఇలాంటివి చూడటం వల్ల మరింత టెన్షన్‌ తప్పితే, దానివల్ల ఫలితం ఉండదు.

సానుకూల దృక్పథం

పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు పూర్తిగా సానుకూల దృక్పథంతో అడుగులు వేయాలి. ముఖ్యంగా తమ చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ప్రతికూల ధోరణితో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంతో ముఖ్యం. దీంతోపాటు తాము గతంలో సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొందాలి. ఒత్తిడికి గురైన సందర్భంలో.. తాము గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. ఫలితంగా తాము హాజరు కాబోతున్న పరీక్షలో మెరుగ్గా రాణించగలమనే మానసిక ధీమా లభిస్తుంది. తమ సబ్జెక్ట్‌ నైపుణ్యాలపై నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి ఆందోళన లేకుండా ఏకాగ్రతతో ప్రిపరేషన్‌ సాగించేందుకు వీలవుతుంది. 

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

పరీక్ష రోజుకు సిద్ధంగా

కీలకమైన పరీక్ష రోజు చూపే ప్రతిభే భవిష్యత్తును నిర్దేశిస్తుందని గుర్తించాలి. వాస్తవానికి చాలా మంది పరీక్ష రోజున అనవసర ఆందోళనకు గురవుతారు. దీంతో కొశ్చన్‌ పేపర్‌ చేతిలోకి రాగానే అలసటకు లోనవుతారు. దీనికి పరిష్కారంగా పరీక్ష హాల్లోకి వీలైనంత ముందుగా ప్రవేశించాలి. అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. పరీక్షకు వెళ్లేందుకు అవసరమైన హాల్‌టికెట్, ఇతర పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఫలితంగా చివరి క్షణంలో ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది.

యోగా.. ధ్యానం

ఒత్తిడి నివారణలో యోగా, ధ్యానం అద్భుత సాధనాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు కొద్దిసేపు మెడిటేషన్‌ చేయడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొనే సంసిద్ధత లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయం యోగా, ధ్యానం వంటి వాటికి కేటాయించాలి. 

చ‌ద‌వండి: GS Biology: గ్రూప్ 1, 2లోప్రశ్నలు ఎక్కువగా పదోతరగతి స్థాయిలోనే!!

ఒత్తిడిని జయించడానికి ముఖ్య సూచనలు

  • ప్రతిరోజు దినచర్యను తమకు ఇష్టమైన వ్యాపకంతో ప్రారంభించాలి.
  • రోజూ కొద్దిసేపు యోగా, నడక, వ్యాయామం వంటివి చేయాలి.
  • చదవాల్సిన అంశాల జాబితాను ముందుగానే రూపొందించుకోవాలి.
  • విసుగు, కోపం, ఆవేదన, నిరాశ నిస్పృహలకు దూరంగా ఉండాలి.
  • ఇతరుల విజయాలను చూసి ఆందోళన చెందకూడదు. వారు విజయం సాధించిన తీరుపై సానుకూల దృక్పథంతో సలహాలు స్వీకరించాలి.
  • డెడ్‌లైన్స్,లాస్ట్‌ మినిట్‌ వరకు వేచి చూడకుండా.. ముందుగానే ప్రీ ప్లాన్‌ అప్రోచ్‌ అనుసరించాలి.
  • ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం ఆరు గంటలు నిద్రకు కేటాయించాలి. 

#Tags