TSPSC Group 2 Exam Breaking News 2024 :తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 పేపర్-1 కఠినం.. పేపర్-2 కొశ్చన్ పేపర్ మధ్యస్థం.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలు ఆదివారం మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో మొదటి, రెండో పేపర్ పరీక్షలు నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ఇప్పటికే జారీచేసిన గ్రూప్స్ నోటిఫికేషన్లలో ఇదే చివరిది.
పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ కఠినంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలించేలా పశ్నపత్రం ఉందని మెజార్టీ అభ్యర్థులు చెప్పారు. ఇస్త్రో, జాతీయ అవార్డులు, ఖేలో ఇండియా, కాగ్, విద్యుత్ వాహనాలు, నీతి అయోగ్, వికలాంగులు, సీనియర్ సిటీజన్స్, జాగ్రఫీ, ఐఐటీలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని వెల్లడించారు. దీంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని ఎక్కువ మంది అభ్యర్థులు తెలిపారు.
ఇదీ చదవండి: గ్రూప్–2 పేపర్-1 కొశ్చన్ పేపర్ & కీ ఇదే.. ఈ సారి ప్రశ్నలకు సమాధానాలు ఇవే...
పేపర్-2 లో హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో హిస్టరీ కఠినంగా ఉండగా, పాలిటీ కాస్త సులభంగా ఉందని పేర్కొన్నారు. సొసైటీపై ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ప్రధానంగా తెలంగాణ హిస్టరీపై అడిగిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలరని పేర్కొన్నారు.
46.75% శాతమే హాజరు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్షను నిర్వహించారు. అలాగే ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరిగింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు దారుణంగా సగంమంది కంటే ఎక్కువగానే గైర్హాజరు అయ్యారు. గ్రూప్ 2 తొలిరోజు పేపర్ –1 కు 46.75% (2,57,981 మంది), పేపర్–2 కు 46.30% (2,55490 మంది) మాత్రమే హజరయ్యారు.