TG DSC 2024 Fake Certifications : డీఎస్సీలో... టీచర్ జాబ్ కోసం అడ్డదారిలో... ఈ న్యూస్ చదివితే షాక్ అవ్వాల్సిందే...?
ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు అక్టోబర్ 9వ తేదీన నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అడ్డదారిలో సర్టిఫికెట్లు.. ఇలా..?
ప్రభుత్వ టీచర్ ఉద్యోగంను ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్‌ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది.
కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది.
మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.
ఈ మోసాల్లో మచ్చుకు కొన్ని ఇలా...
ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్‌తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా..
ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చదువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.
ఓ అభ్యర్థి అయితే..
వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.
భార్యాభర్తలిద్దరూ...
మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.
ఓ మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటాలో..
కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.
అర్హత లేకున్నా తహసీల్దార్ ఆఫీస్‌ల నుంచి ఈడబ్ల్యూఎస్సర్టిఫికెట్లు సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హత లేకున్నా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని, వారి వద్ద నిజమైన అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.