TRT Notification 2023: ఈ జిల్లాలో మొత్తం 823 పోస్టులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదలైంది. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 823 పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 358 పోస్టులు, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 78, రంగారెడ్డి జిల్లా పరిధిలో 196, వికారాబాద్‌ జిల్లా పరిధిలో 191 పోస్టుల భర్తీకి నవంబర్‌ 20 నుంచి 30వ తేదీల మధ్య తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు (కంప్యూటర్‌ ఆధారిత) నిర్వహించనున్నట్లు పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చింది. దివ్యాంగులకు అదనంగా మరో ఐదేళ్లు సడలింపు ఇచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించింది.

చదవండి: TS TET 2023 exam: టెట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

మొదలైన బదిలీల ప్రక్రియ
రంగారెడ్డి జిల్లాలో 6,919 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది ఏళ్ల తరబడి ఒకేచోట కొనసాగుతున్నారు. ఇలాంటి వారందరికీ స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బదిలీల పక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు 4,722 దరఖాస్తులు అందాయి. గతంలో 4,194 మంది దరఖాస్తు చేసుకోగా, తాజాగా మరో 528 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 212 మంది ఎలాంటి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల పేర్లను శుక్రవారం కలెక్టరేట్‌లో డిస్‌ప్లే చేశారు. 10, 11వ తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 3లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

జిల్లాల వారిగా ఖాళీలు..

జిల్లాపేరు స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా పండిట్‌ పీఈటీలు ఎస్‌జీటీలు మొత్తం
హైదరాబాద్‌  116   57 22 163 358
రంగారెడ్డి  48 25 06 117 196
మేడ్చల్‌ 25 07 01 45 78
వికారాబాద్‌ 102 12 77 191

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 465 పోస్టులు హైదరాబాద్‌ జిల్లాలో 358 తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ

చదవండి: TRT Notification 2023: ఈ జిల్లాలో 586 పోస్టులు

పారదర్శకంగా నిర్వహిస్తాం..
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియతో పాటు కొత్తగా చేపట్టనున్న టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎలాంటి అవినీతి, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వం. అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ మొదలు.. పరీక్షలు, పేపర్‌ వాల్యూయేషన్‌ ఇలా ప్రతీది ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహిస్తాం. మానవ తప్పిదాలకు ఆస్కారం లేదు. ఫేక్‌ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసిన అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. బదిలీలు, ఖాళీల భర్తీ విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు. పైరవీలకు ఎంత మాత్రం ఆస్కారం లేదు.
– సుశీందర్‌రావు, డీఈఓ

#Tags