Manu Bhaker: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ మనూ భాకర్
గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్ వేదికగా భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. జూలై 28వ తేదీ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది.
దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా.. కిమ్ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది. కాగా.. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.
ఏడో మహిళా క్రీడాకారిణిగా..
ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్; కాంస్యం–2012 లండన్), మేరీకోమ్ (బాక్సింగ్; కాంస్యం–2012 లండన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్ (రెజ్లింగ్; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు.
Olympic Medal Winners: ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఇదే!
షూటింగ్‌లో మెడల్ గెలిచిన భారతీయులు వీరే..
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో భారతీయ షూటర్‌గా, తొలి మహిళా షూటర్‌గా మనూ భాకర్ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్) ఈ ఘనత సాధించారు.