ISRO Cartosat-2: సముద్రంలోకి కార్టోశాట్–2
దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో ఫిబ్రవరి 16వ తేదీ ప్రకటించింది.
పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు.