Skip to main content

Chandrayaan 4: అంతరిక్షంలో భారత్‌ జైత్రయాత్ర.. రూ.2 వేల‌ కోట్లకు పైగా ఖర్చు

భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్‌ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది.
Union Cabinet approves Chandrayaan-4 mission on September 18  Indian space mission aims to collect lunar samples and bring them back safely Union Cabinet Approves Venus Orbiter Mission, Including Chandrayaan-4

ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబ‌ర్ 18వ తేదీ ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్‌–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది.

చంద్రయాన్‌–4 స్పేస్‌క్రాఫ్ట్‌ అభివృద్ధి, లాంచింగ్‌ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్‌–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్‌–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు.  

ఎన్‌జీఎల్‌వీ సూర్య 
పాక్షిక పునర్వినియోగ తదుపరి తరం లాంచ్‌ వెహికల్‌(ఎన్‌జీఎల్‌వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్‌–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది.

ఎన్‌జీఎల్‌వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్‌లో మొదటి మాడ్యూల్‌(బీఏఎస్‌–1) అభివృద్ధికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్‌ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది.  

Earth Mars Transfer Window: అందుబాటులోకి వస్తున్న‌ మార్స్‌ ట్రాన్స్‌ఫర్‌ విండో! ఈ విండో గురించి తెలుసా?

➣ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌ ఇప్‌ డెవలప్‌మెంట్‌(బయో–రైడ్‌) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు.  

➣ యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్‌  రియాలిటీ రంగాల్లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌(ఎన్‌సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ద్వారా ఇండియాను కంటెంట్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.  

➣ 2024–25 రబీ సీజన్‌లో ఫాస్ఫేట్, పొటాష్‌ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్‌ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.  

➣ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌(పీఎం–ఆశా)కు కేబినెట్‌ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్‌లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.  

➣ దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.

Spacewalk: రికార్డు.. అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్‌ స్పేస్‌వాక్

‘వీనస్‌ ఆర్బిటార్‌ మిషన్‌’  
శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్‌ ఆర్బిటార్‌ మిషన్‌’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్‌ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్‌ ఆర్బిటార్‌ మిషన్‌’కు కేంద్ర కేబినెట్‌ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. 

Published date : 19 Sep 2024 12:54PM

Photo Stories