Vidadala Rajini: ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని, వాటిని సడలించి పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు.
ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి

ఈ మేరకు అక్టోబ‌ర్ 18న‌ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్‌ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద వైద్య సీట్ల చొప్పునే అనుమతిచ్చేలా నిబంధనలు రూపొందించింది.

అలాగే కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతివ్వాలంటే 605 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి కూడా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర విభజన తర్వాత టెర్షియరి కేర్‌ సర్వీసెస్‌ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది.

ఈ నేపథ్యంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందుబాటు­లోకి తీసుకువస్తోంది. వీటిలో ఇప్పటికే 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 12 కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగు­తున్నాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి.

చదవండి: Andhra Pradesh Govt Jobs: వైద్య ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

సిబ్బంది నియామకాలు కూ­డా పూర్తయ్యాయి. కానీ కొత్త నిబంధనల వల్ల ఏపీకి ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉండదు’ అని కేంద్ర మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు విడదల రజిని వివరించారు.

వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొస్తున్న సంస్కరణలకు కేంద్రం తరఫున తగిన సహకారం అందించాలని.. ఏపీ ప్రజలకు ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు.

తమ వినతికి మన్సూక్‌ మాండవీయ సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు.  ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదిత్యనాథ్‌దాస్, ఏపీ భవన్‌ అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాంశు కౌశిక్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు. 

#Tags