Skip to main content

Teachers: ఉపాధ్యాయ ఉద్యోగ కల.. నెరవేరిందిలా..

లక్కవరపుకోట: వారంతా రాత్రీ పగలు కష్టపడి చదివారు. ఉపాధ్యాయ కోర్సు పూర్తిచేసి డీఎస్సీకి అర్హత సాధించారు.
Teacher Job Dream Successful in Andhra Pradesh  Successful candidates celebrating job postings

కోర్టు వివాదంతో వారు ఉద్యోగాలకు దూరమయ్యారు. వారి సమస్య పరిష్కారానికి రెండు దశాబ్దాల పాటు ఏ పాలకుడూ కనీసం చొరవ చూపలేదు. సాహసం చేయలేదు. వారి వేదనను పట్టించుకోలేదు. వారికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోన్‌రెడ్డి 2018 సంవత్సరంలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో భాంగంగా నిర్వహించిన పాదయాత్రలో 1998 డీఎస్సీ అభ్యర్థులు వారి సమస్యను ఏకరువుపెట్టారు. ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయ అభ్యర్థుల సమస్యను జగన్‌మోన్‌రెడ్డి సావదానంగా ఆలకించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 1998 డీస్సీలో అర్హత పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా 4,072 మందికి, విజయనగరం జిల్లాలో 490 మందికి పోస్టింగ్‌లు కేటాయించి వారిలో ఆనందం నింపారు. అందుకే వారంతా మా మంచి సీఎం అంటూ జగన్‌ను ప్రశంసిస్తారు. ఎన్నికలవేళ హామీ ఇచ్చి 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు మోసం చేశారంటూ ఇప్పటికీ ఆవేదన వ్యక్తంచేస్తుంటారు.

"ఉపాధ్యాయుడు కావాలన్నది కల. డీఎస్సీకి కష్టపడి చదివాను. 1998 డీఎస్సీలో అర్హత సాధించినా కోర్టు వివాదంతో ఉద్యోగం రాలేదు. ఏళ్ల తరబడి పాలకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో నా కల నెరవేరింది. విద్యార్థులకు చక్కగా బోధిస్తున్నాను. నా కల నెరవేర్చిన సీఎం రుణం తీర్చుకోలేనిది. మా మంచి సీఎం ఆయన". – ఎల్‌.కోటకు చెందిన 1998 డీఎస్సీ ఉపాధ్యాయుడు మాట ఇది.


"మాది కొత్తవలస మండలం. ప్రజాసంకల్పయాత్రగా వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మా సమస్యను వివరించాం. అర్హత సాధించి ఉద్యోగానికి దూరమైన తీరును తెలియజేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించి మా కుటుంబాల్లో కొత్త వెలుగు నింపారు. ఈ రోజు పిల్లాపాపలతో ఆనందంగా ఉన్నామంటే ఆయన దయే.
ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పాలకుడంటే అలా ఉండాలి. గతంలో మేము చదువుకునేటప్పుడు పాఠశాలలో కనీసం మరుగుదొడ్డి ఉండేది కాదు. ఇప్పుడు పాఠశాలలను చూస్తే ముచ్చటేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉజ్వల భవితకు ప్రభుత్వ బడులు భరోసాగా నిలుస్తున్నాయి". – ఉద్యోగం పొందిన ఓ ఉపాధ్యాయుడి ఆనందం ఇది. 


"మా ఆయన బాగా చదువుకున్నారు. 1998 డీఎస్సీలో అర్హత సాధించినా ఉద్యోగం రాకపోవడంతో ఎంతో వేదనకు గురయ్యేవారు. ఊరిలోని వ్యక్తుల సూటిపోటిమాటలకు బాధపడేవారు. కష్టపడి చదివినా ఫలితం లేకపోయిందంటూ మనోవేదన చెందేవారు. ఆర్థికంగానూ ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో మా ఆయనకు ఉద్యోగం వచ్చింది. సంతోషంగా ఉన్నాం. మేము ఉదయం లేచి ముందు చూసేది సీఎం ఫొటోనే. ఆయన మేలు ఎన్నటికీ మరచిపోలేనిది". – జామి మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి భార్య సంతోషం ఇది

Published date : 11 May 2024 03:37PM

Photo Stories