Skip to main content

Regularization of Singareni Jobs: సింగరేణిలో 2,364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ.. త్వరలోనే వారికి శాశ్వత ఉద్యోగాలు

Regularization of Singareni Jobs

సాక్షి, హైదరాబాద్‌/ గోదావరిఖని: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. సంస్థలో చేరిన తర్వాత ఒక కేలండర్‌ సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్‌ చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం వెల్లడించారు.

ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి వీరిని జనరల్‌ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో బలరాం తెలిపారు. సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జనరల్‌ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని, సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. 

TGPSC Group 1 Mains Exam: గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదా వేయండి.. అభ్యర్థుల డిమాండ్‌!

వీరు ఎవరంటే..!
సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్‌ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. వీరు ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్‌ మజ్దూర్లుగా గుర్తిస్తారు. వీరిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉంటే పదోన్నతులు పొందడానికి అర్హులవుతారు. క్వార్టర్ల కేటాయింపులో కూడా ఈ జనరల్‌ మజ్దూర్లకు ప్రాధాన్యం ఉంటుంది.

Wipro Company Hirings: గుడ్‌న్యూస్‌ చెప్పిన 'విప్రో' కంపెనీ.. త్వరలోనే 12వేల ఉద్యోగాలు

ఈసారి క్రమబద్ధీకరణ ద్వారా 234 మంది మహిళలు శాశ్వత ఉద్యోగాలు పొందనున్నారు. ఏరియాల వారీగా పరిశీలిస్తే కార్పొరేట్‌ ఏరియా (25), కొత్తగూడెం (17), ఇల్లందు (9), మణుగూరు (21), భూపాలపల్లి (476), రామగుండం–1 (563), రామగుండం–2 (50), రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్టు (240), శ్రీరాంపూర్‌ (655), మందమర్రి (299), బెల్లంపల్లి (9) మంది రెగ్యులరైజ్‌ కానున్నారు.

Published date : 02 Sep 2024 09:25AM

Photo Stories