State Sports Authority: ప్రవేశాలు జరిగేనా?

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాకు క్రీడల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా వాలీబాల్‌లో జిల్లా జట్టు రాష్ట్రంలో ఎక్కడ టోర్నీ ఉన్నా సత్తా చాటేవారు.

2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్‌ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. వాలీబాల్‌ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారులుగా ఎదిగారు.

వీరు మొదట్లో అకాడమీలో వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకొని దేశానికి ప్రాతినిథ్యం వహించారు. ఇదే అకాడమీలో శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు జాతీయ సీనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008లో వాలీబాల్‌ అకాడమీని మూసివేశారు.

చదవండి: ITF Tournament: ఐటీఎఫ్‌ మహిళల డబుల్స్‌లో విజేత‌గా రష్మిక –వైదేహి ద్వయం

మళ్లీ వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు

జిల్లా కేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో వాలీబాల్‌ అకాడమీ 2022లో తిరిగి ఏర్పాటైంది. స్టేడియం ఆవరణలోగల స్విమ్మింగ్‌పూల్‌లోని అంతస్తుల గదులను అకాడమీ క్రీడాకారుల వసతి కోసం కేటాయించి గదుల ఆధునీకీకరణ పనులు చేపట్టారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్‌ కోర్టులను తీసివేసి వాటి స్థానంలో కొత్త కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్‌లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. గోడ చుట్టూ ఆకర్షణీయంగా వాలీబాల్‌ క్రీడాచిత్రాలను తీర్చిదిద్దారు.

త్వరలో ప్రవేశాలు

జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ అకాడమీలో త్వరలో క్రీడాకారుల ప్రవేశాలు కల్పిస్తాం. ఇప్పటికే క్రీడాకారుల వసతి సామగ్రి వచ్చాయి. అకాడమీ ఏర్పాటుతో నైపుణ్యంగల క్రీడాకారులను వెలికితీయవచ్చు. ప్రవేశాలకు సంబంధించి ఇది వరకే ఎంపికలు నిర్వహించాం. శాట్‌ ఆదేశాల మేరకు త్వరలో ప్రవేశాలు కల్పిస్తాం.
– ఎస్‌.శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

#Tags