TSCHE: పీహెచ్‌డీ అడ్మిషన్ల ఆరోపణలపై త్రిసభ్య కమిటీ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభా గాల్లో కల్పించిన పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది.

ఈ కమిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, సీపీ గేట్‌ కన్వీనర్‌, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి ధ్రువీకరించారు. కేయూలో కొంతకాలం క్రితం అన్ని విభాగాలు కలిపి సుమారు 200 సీట్లకు పైగానే నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రవేశాలు కల్పించారు.

చదవండి: Careers in Space: అంతరిక్ష విభాగంలో అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్‌ మార్గాలు ఇవే..

ప్రధానంగా పార్ట్‌టైం పద్ధతిలో 25 శాతం సీట్లు, పుల్‌టైం అభ్యర్థులుగా 75 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఎక్కువ శాతం సీట్లు పార్ట్‌టైం అభ్యర్థులకే ప్రవేశాలు కల్పించారనేది ప్రదాన ఆరోపణ. అదేవిధంగా పలు విభాగాల్లో మెరిట్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కూడా ఆరోపణలు వచ్చా యి.

పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో వివిధ విభా గాల్లో సీట్లు లభించని అభ్యర్థులు వివిధ విద్యార్థి సంఘాల జాక్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పీహెచ్‌డీ అడ్మిషన్ల అక్రమాలపై విచారణ జరిపించాలని, తమపై దాడులు చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే ఎస్‌డీఎల్‌సీఈ ప్రాంగణంలో నెలరోజులకు పైగా దీక్షలు కొనసాగించారు. అడ్మిషన్లలో నిబంధనలు పాటించలేదని, వీసీ, అప్పటి రిజిస్ట్రార్లు ఇష్టానుసారంగా వ్యవహరించారని, పలు విభాగాల డీన్లపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

చదవండి: Dr Sandeep Singh Selling Vegetables : నాలుగు మాస్టర్‌ డిగ్రీలు.. ఒక పీహెచ్‌డీ చేశా.. ఇందుకే రోడ్ల‌పై కూరగాయలు అమ్ముతున్నా..

ఇటీవల మరోమారు సీఎం రేవంత్‌ దృష్టికి..

అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఈ దీక్షల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్నత విద్యాకమిషనర్‌ బుర్రా వెంకటేశం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఆర్ట్స్‌, సోషల్‌ సైన్స్‌, సైన్స్‌, ఎడ్యుకేషన్‌, ఫార్మసీ, కామ ర్స్‌, ఇంజనీరింగ్‌, లాలో పీహెచ్‌డీ రెండో కేటగిరీలో అడ్మిషన్లు జరిగిన వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. కమిటీ విచారణతో పీహెచ్‌డీ అడ్మిషన్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, నియమనిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. విచారణ కమిటీ వేసిన విషయం గురువారం యూనివర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, పరిశోధకుల్లో చర్చగా మారింది.
 

#Tags