Sports University: రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌/జెడ్పీసెంటర్‌ (మహబూ­బ్‌న­గర్‌)­: దక్షిణ కొరియా తరహాలో తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.
రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జూలై 5న అక్కడి అభివృద్ధి, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా సియోల్‌లోని డీ మిలటరీ జోన్‌ సమీపంలో ఏర్పాటుచేసిన చిల్డ్రన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు ఎంతో అద్భుతంగా ఉందని, ప్రపంచ పర్యాటకులను ఈ పార్కు ఎంతో ఆకర్షిస్తుందని చెప్పారు.

రాబోయే 5 నెలల్లో మహబూబ్‌నగర్‌లోని శిల్పారామంలో చిల్డ్రన్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు తరహాలో నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీఇచ్చారు. శిల్పారామం వెనకవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ అమ్యూజ్‌మెంట్‌ పార్కు ఏర్పాటు చేస్తామని, చిన్నపిల్లలు, యువతను ఈ పార్కు ఎంతో ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు.

చదవండి: Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌... ఒక్క‌సారిగా జీతం భారీగా పెంపు

పార్కు నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాలమూరును రాష్ట్రంలోనే ప్రఖ్యాత టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే తమ ధ్యేయం అన్నారు. ట్యాంక్‌బండ్, సస్పెన్షన్‌ బ్రిడ్జి ఐలాండ్, శిల్పారామం, కేసీఆర్‌ పార్క్, టెంట్‌సిటీ, మన్యంకొండ రోప్‌వే తరహా టూరిజం అట్రాక్షన్స్‌ జిల్లాకు ఇతర రాష్ట్రాల వారే కాకుండా దేశవ్యాప్తంగా పర్యాట­కులు పెద్దఎత్తున తరలివచ్చేలా తయారు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియాలోని ఇండియన్‌ అంబాసిడర్‌ అమిత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌ పాల్గొన్నారు.

చదవండి: Gita Press: గాంధీ శాంతి బహుమతి.. రూ.కోటి న‌గ‌దు బ‌హుమ‌తి నిరాకరించిన గీతా ప్రెస్

#Tags