Dasari Parvathi: సుమధుర స్వరంతో ప్రసిద్ధ గాయకులు, ప్రజల్ని ఆకట్టుకుంటున్న యువతి

ప్రతిభకు పేదరికం అడ్డు కాదు.. సాధన చేస్తే ఏదీ కష్టం కాదు.. అని నిరూపించింది మారుమూల పల్లెలో, నిరుపేద కుటుంబంలో పుట్టిన దాసరి పార్వతి.
దాసరి పార్వతి

ఇంటర్‌ వరకు చదువుకున్న పార్వతి.. చిన్నతనం నుంచి తనకు ఎంతో ఇష్టమైన సంగీతాన్నే జీవిత విజయానికి బాటగా మార్చుకుంది. టీటీడీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీత సాధన మొదలుపెట్టి.. తన ‘సరిగమపా..’లతో ప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

కష్టాల నుంచి సంగీత కళాశాల వైపు..

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మారుమూల పల్లె లక్కసాగరం. అక్కడ నివసించే శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో చివరి సంతానం పార్వతి. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతో పాటు కష్టపడేది. ఆమె మనసు మెల్లగా పాటలవైపు మళ్లింది. డబ్బులు చెల్లించి.. సంగీతం నేర్చుకునే ఆర్థికస్థోమత లేదు. అదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న ఎస్వీ సంగీత, నృత్య కళాశాల గురించి తెలుసుకుంది. అక్కడ ఉచితంగా సంగీతం నేర్పిస్తారని తెలియడంతో 2017లో పార్వతి సంగీత కళాశాలలో చేరింది. అక్కడ అతి తక్కువ కాలంలోనే అపార ప్రతిభను సొంతం చేసుకుంది. సుమదుర స్వరంతో సంకీర్తనలు ఆలపిస్తూ గురువుల ప్రశంసలందుకుంది. ఈక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ నిర్వహించే ‘అదివో.. అల్లదివో’ కార్యక్రమానికి ఎంపికైంది. తన అద్భుత గానంతో న్యాయ నిర్ణేత, ప్రముఖ గాయని శైలజ నుంచి ప్రశంసలు అందుకుంది. తిరుపతిలో ఒక చానల్‌ నిర్వహించిన ఆడిషన్ కు వెళ్లి ఎంపికైంది. హైదరాబాద్‌లో ఆ చానల్‌ నిర్వహించిన ‘సరిగమప’ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాటను సుమ«ధురంగా పాడి.. న్యాయనిర్ణేతల ప్ర«శంసలందుకుంది. పార్వతి స్వరమాధుర్యానికి ముగ్ధులైన న్యాయనిర్ణేతలు ‘ఏం కావాలో కోరుకోవాలని’ చెప్పగా.. పార్వతి మారుమూల గ్రామమైన లక్కసాగరానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని వెంటనే ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. 

నాలాంటి వారికి సాయం చేస్తా..

నాకు ఇష్టమైన పాట.. నా గ్రామానికి బస్సును తెప్పించడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం మంచి గాయనిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆసక్తి ఉన్న ఆడపిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పిస్తా. మన సంప్రదాయ కళల్లో ఒకటైన సంగీతం.. యావత్‌ ప్రజల హృదయాలను సృజింపజేసే సాధనం. అలాంటి సంగీతం విశిష్టతను మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తా.
– దాసరి పార్వతి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల

భవిష్యత్‌లో మరింతగా ఎదగాలి..

కష్టాల నుంచి కళాశాల చేరిన పార్వతి.. ఉదయం 5 గంటలకే క్రమశిక్షణతో సంగీత సాధన చేసేది. తనకు వచ్చిన డబ్బుల్లో కూడా కొంత మొత్తాన్ని అనాథ ఆశ్రమాలకు అందజేస్తుంటుంది. ఇప్పుడు తన గానంతో అందరి మన్ననలు పొందుతున్న పార్వతి మా కళాశాల విద్యార్థి కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఆమె మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. 
– ఎం.సుధాకర్, ప్రిన్సిపాల్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల

#Tags