Pilot Training: కర్నూలు ఎయిర్ పోర్టులో పైలట్ శిక్షణ కేంద్రం.. టెండర్లకు గడువు ఎప్పటివరకంటే..
ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వీఎన్ భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ నిర్మిస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు.