Sammakka Sarakka Central Tribal University: ఆగస్టు నుంచి ట్రైబల్‌ వర్సిటీలో క్లాసులు.. 33 శాతం రిజర్వేషన్‌లు వీరికే

ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్‌), బీఏ (సోషల్‌ సైన్స్‌) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని మార్చి 8న‌ ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్‌ కవితతో కలిసి ప్రారంభించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్‌ వస్తే కాంపౌండ్‌ వాల్, డీపీఆర్, టెండర్‌ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు.

చదవండి: Career Opportunities: మ్యాథమెటిక్స్‌ కోర్సులతో కెరీర్‌ అవకాశాలు..

ట్రైబల్‌ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్‌ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్‌లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్‌ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు.

చదవండి: Nannaya University: యూనివర్సిటీలో పెండింగ్‌ పనులకు శ్రీకారం

యూజీసీ అధీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్‌ ప్రొఫెసర్‌ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ శరత్, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్‌ ఎగ్జామినేషన్‌ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. 

#Tags