Gurukul Institutions: సరస్వతి నిలయాల్లో.. కాలకృత్యం.. నిత్య నరకం!

పొద్దున లేచాక పళ్లుతోముకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, బడికివెళ్లాలి, చదువుల్లో పోటీపడాలి.. పిల్లలెవరికైనా ఇది మామూలే. కానీ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం.. పొద్దున లేస్తే క్యూలైన్లలో నిల్చోవాలి. కాలకృత్యాల కోసం, స్నానం కోసం.. పోటీపడి లైన్‌ కట్టాలి. ఆ తర్వాతే.. బడి, చదువు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు లేకపోవడంతో, ఉన్నవీ పాడైపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ముఖ్యంగా బాలికల గురుకులాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.చాలినన్ని బాత్రూములు లేక.. చాలా మంది విద్యారి్థనులు రెండు, మూడు రోజులకోసారి స్నానం చేసే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బాధను తీర్చాలని వేడుకుంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టాయిలెట్లు, బాత్రూమ్‌లు లేక.. ఉన్న కాసిన్ని కూడా సరిగా లేక నానా తంటాలు పడుతున్నారు. కాలకృత్యాలు కూడా సరిగా తీర్చుకోకుండా, రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉన్నాయి.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటిబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌)లు ఆయా సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఆర్‌ఈఐఎస్‌) నేరుగా పాఠశాల విద్యా శాఖ పరిధిలో కొనసాగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల సొసైటీల పరిధిలో 967 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి నుంచి ఇంటర్మిడియట్‌ వరకు 6,18,880 మంది విద్యార్థులు చదువుతున్నారు.

చదవండి: Ekalavya School Facilities : మా పిల్ల‌ల చ‌దువెలా అంటూ క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు ఏక‌ల‌వ్య విద్యార్థుల త‌ల్లిదండ్రులు..

డిమాండ్‌కు తగిన మేరకు లేక..

ఒక్కో గురుకుల విద్యా సంస్థలో 640 మంది విద్యార్థులుంటారు. ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు 480 మంది విద్యార్థులు కాగా.. ఇంటర్మీడియట్‌లో 160 మంది ఉంటారు. గురుకుల పాఠశాల వసతుల్లో భాగంగా కనీసం పది మంది విద్యార్థులకు ఒక బాత్రూం, కనీసం ఏడుగురికి ఒక టాయిలెట్‌ ఉండాలనేది నిబంధన. ఈ లెక్కన ఒక్కో గురుకుల పాఠశాలలో 64 బాత్రూమ్‌లు, 90 టాయిలెట్లు ఉండాలి. కనీసం పది మందికి ఒకటి చొప్పున ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది.

కానీ చాలాచోట్ల 1ః20 నిష్పత్తిలో కూడా లేవు. గురుకుల విద్యా సంస్థల్లో బాత్రూమ్‌లు, టాయిలెట్ల పరిస్థితి తెలుసుకునేందుకు ఓ సంస్థ సమాచార హక్కు చట్టం కింద 29 గురుకులాల్లో వివరాలను సేకరించింది. ఆ 26 గురుకులాలు, 3 కేజీబీవీలలో ప్రస్తుతం 15136 మంది విద్యార్థులున్నారు. వారికి 1,513 బాత్రూంలు అవసరమవగా.. 870 మాత్రమే ఉన్నాయి. 1ః10 నిష్పత్తిలో లెక్కించినా.. 644 బాత్రూమ్‌లు తక్కువగా ఉన్నాయి. ఇక 2,162 టాయిలెట్లు అవసరంకాగా.. 1,104 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తలుపులు సరిగా లేనివి, నిర్వహణ సరిగా లేక పాడైపోయినవీ గణనీయంగానే ఉన్నాయి.

దీంతో వీలు చిక్కినప్పుడే స్నానాలు చేస్తున్నామని.. కాలకృత్యాలు తీర్చుకోవడాన్నికూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. శాశ్వత ప్రాతిపదిన ఉన్న గురుకులాల్లో కంటే.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అనారోగ్యాల పాలవుతున్న విద్యార్థులు 

రోజూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి, పళ్లుతోముకుని, స్నానం చేయాలని ప్రాథమిక విద్య నుంచే బోధిస్తారు. కానీ గురుకులాల్లో ఈ పరిస్థితి ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. స్నానం సరిగా చేయకపోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడంలో తేడాలతో.. వివిధ రకాల అనారోగ్యాల బారినపడుతున్నామని అంటున్నారు. ఈ తీరు మంచిది కాదని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర రాజధానిలోనూ అలాగే.. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న సంక్షేమ గురుకులాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. చాలా చోట్ల బాత్రూమ్‌లు, టాయిలెట్లు నిర్వహణ సరిగా లేక పాడైపోయాయి. కాస్త బాగున్న వాటికీ తలుపులు విరిగిపోయి వాడుకోలేని పరిస్థితి ఉంది. ఉదాహరణకు కొత్తపేటలోని సరూర్‌నగర్‌ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో మొత్తం 640 మంది చదువుతున్నారు. మూడు అంతస్తుల ఈ భవనంలో ఫ్లోర్‌లో 15 టాయిలెట్స్‌ ఉన్నా.. అందులో సగం పనిచేయట్లేదని, నీళ్లు రావడం లేదని విద్యారి్థనులు వాపోతున్నారు.

ఒక్క బాత్రూమ్‌కు కూడా తలుపు లేదు 
మా స్కూల్‌లో 620 మంది విద్యార్థులున్నారు. బాత్రూమ్‌లు ఉన్నా ఒక్కదానికి కూడా డోర్‌ లేదు. మేమంతా బయట సంపు దగ్గరే స్నానాలు చేస్తాం. ఇక 36 టాయిలెట్లు ఉన్నా.. పొద్దున్నే పెద్ద లైన్‌ ఉంటుంది. దీంతో సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తోంది. 
– విష్ణు, ఐదోతరగతి, గిరిజన గురుకుల పాఠశాల, కిన్నెరసాని

మూడే పని చేస్తున్నాయి మా స్కూల్‌ ఆవరణలో
17 మరుగుదొడ్లు ఉన్నా.. మూడింటిలోనే నీళ్లు వస్తున్నాయి. మరుగు దొడ్లు కంపు కొడుతూనే ఉంటాయి.మేమంతా బయటికే వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకు సరిపడా స్నానపు గదులు లేక.. చాలా మంది బోరు బావి నల్లా వద్దే స్నానాలు చేస్తారు. కొందరైతే నాలుగైదు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తారు. 
– ఆర్‌.ప్రసాద్, 9వ తరగతి, గిరిజన గురుకుల పాఠశాల, ఆదిలాబాద్‌ 

#Tags