Andhra Pradesh: ఉజ్వల భవితకు ‘విద్యాదీవెన’

రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యాదీవెన తోడ్పాటు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఒక వరమని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ తెలిపారు.

డిసెంబ‌ర్ 20న‌ తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం నుంచి 2023–24 సంవత్సరానికి ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’. ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో లబ్ధి దారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’పథకం కింద 10 మంది విద్యార్థులు రూ.92.21 లక్షలు, ‘జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం’కింద 6గురు రూ.6.50 లక్షలు లబ్ధి పొందారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చదవండి: Andhra Pradesh: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ కులాల పేద విద్యార్థులకు ఈ ప‌థ‌కాలు

అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చదవగలిగే ప్రతిభ ఉండి కూడా పేదరికం కారణంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక విదేశీ విద్యాసంస్థల్లో చదువుకోవాలన్న కోరిక ఉన్న వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం బాసటగా నిలిచిందని, వారి విదేశీ విద్యకయ్యే పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు.

అలాగే యూపీఎస్సీ నిర్వహించే అత్యున్నత సివిల్‌ సర్వీసెస్‌లలో ఆంధ్రప్రదేశ్‌ యొక్క ప్రాతినిథ్యం పెంచేందుకు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక పథకం ద్వారా లక్ష రూపాయలు, రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

విద్యార్థులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్నారు.అనంతరం మెగా చెక్కులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్‌, జేసీలు అందజేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జాకీర్‌హుస్సేన్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి సందప్ప తదితరులు పాల్గొన్నారు.

సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తా

వ్యవసాయ ఆధారిత కుటుంబం మాది. డిగ్రీ తర్వాత ఉద్యోగం చూసుకోవాలనుకున్నా. సివిల్స్‌ చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారికి జగనన్న ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిసి సంతోషం కలిగింది. నేను సివిల్స్‌ చదువుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరుకావడానికి ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేసింది. సివిల్స్‌లో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణత సాధిస్తా.

– కే.సాయికుమార్‌, కుమ్మరపల్లి, చిట్వేల్‌ మండలం

విదేశాల్లో చదవాలనే కల నెరవేరింది

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత చదువులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉండడం సంతోషంగా ఉంది. విదేశాల్లో చదవాలనే మా లాంటి వారిక కలను ప్రభుత్వం నెరవేర్చింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్‌ షెఫ్ఫీల్డ్‌లో ఎంబీఏ చదువుతున్నాను. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.14.78 లక్షలు పొందాను. రేండో విడతగా నేడు రూ.6.75లక్షలు మంజూరైంది.
– ఎస్‌.జాహ్నవి, ప్రశాంత్‌నగర్‌, మదనపల్లి

విమాన వీసా చార్జీలు కూడా ప్రభుత్వం చెల్లించింది

మా అబ్బాయి పేరు బి.శశికుమార్‌ ఇంజినీరింగ్‌లో మంచి ఉత్తీర్ణతతో పాసయ్యాడు. విదేశాల్లో చదువుకోవడానికి ప్రవేశ పరీక్షలో మా అబ్బాయి ఉత్తీర్ణత పొందాడు. కానీ విదేశీ విద్య ఖర్చులు భరించే స్థోమత లేదు. ప్రతిభ ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మా అబ్బాయి స్కాట్లాండ్లో ఎమ్మెస్‌ చదువుతున్నాడు. జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ప్రభుత్వం ద్వారా రూ.18 లక్షలు ఆర్థిక సహాయం అందింది. విమాన వీసా చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించింది. ప్రతిభ గల విద్యార్థులను ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వానికి శతకోటి వందనాలు. 
– బి.రమణయ్య, తంబళ్లపల్లి

#Tags