Digital lesson: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

Digital lesson: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

రామన్నపేట : ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. తొలుత 8,9,10వ తరగతులకు డిజిటల్‌ విధానంలో బోధన చేస్తున్నారు. 163 జిల్లా పరిషత్‌, 7 మోడల్‌, 11 కేజీబీవీలు, 3 గురుకులాలు, వివిధ సొసైటీలకు చెందిన 13 స్కూళ్లలో డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా పాఠశా లల్లో మొత్తం 29,785మంది విద్యార్థులు ఉన్నారు. డిజిటల్‌ పాఠాలు బోధించడానికి 525 ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశారు. నూతన విధానం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సలభంగా అర్థం కావడమే కాకుండా వారి సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.

ఒకే పాఠాన్ని మళ్లీ వినే అవకాశం..

గ్రీన్‌బోర్డును చాక్‌పీస్‌లతో రాసేవిధంగా స్లైడింగ్‌ డోర్ల రూపంలో తయారు చేశారు. గ్రీన్‌బోర్డు లోపల ఐఎఫ్‌పీ ఏర్పాటు చేశారు. బోధించే ఉపాధ్యాయుడు బోర్డులాగా వాడవచ్చు. కాంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, మ్యాథ్స్‌కు సంబంధించిన డయాగ్రామ్స్‌, కన్‌స్ట్రక్సన్స్‌.. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రదర్శించి బోధిస్తారు. నిష్ణాతులు, సబ్జెక్ట్‌ నిపుణుల బోధనలు ఆడియోలు, వీడియోల్లో అందు బాటులోకి వస్తాయి. ఒకే పాఠాన్ని మళ్లీ వినే అవకాశం ఉంటుంది. బోధనకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించారు. డిజిటల్‌ బోర్డులు టచ్‌ సెన్సార్‌ విధానంలో పనిచేస్తాయి. ప్రతి టీవీకి రెండు చొప్పున డిజిటల్‌ పెన్స్‌ ఇవ్వడం జరిగింది. డిజిటల్‌ టీవీల ఏర్పాటు కోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున నిధులు ఖర్చు చేసింది.

Also Read: TSPSC Groups Preparation Tips

అధునాతన ఫర్నిచర్‌

విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతమైన ఫర్నిచర్‌ను సైతం సమకూర్చారు. విద్యార్థులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బేంచీలు కార్పొరేట్‌ విద్యా సంస్థల తరహాలో ఉన్నాయి. అలాగే డిజిటల్‌ టీవీలు లేని తరగతుల్లో గ్రీన్‌బోర్డులు అమర్చారు. వీటితో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమీటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

#Tags