Digital Classes For School Students: సర్కారు బడుల్లో అటకెక్కిన డిజిటల్ విద్య..
కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యనందించాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మూన్నాళ్ల ముచ్చటగా మారింది. రూ.లక్షలు వెచ్చించి కంప్యూటర్లు కొన్నప్పటికి వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవాళ్లు లేక మూలకు పడ్డాయి.
ప్రస్తుత ఆధునిక ప్రపంచమంతా డిజిటలైజేషన్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో చాలామంది తల్లిదండ్రులు డిజిటల్ విద్య కోసం ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం సైతం డిజిటల్ విద్య కోసం చర్యలు చేపట్టింది. అందుకోసం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఐటీసీ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.
Hostels Admissions : వసతి గ్రుహాల్లో విద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తులు.. అర్హులు వీరే..
దాదాపు అన్ని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ తరగతులు బోధించేందుకు ప్రత్యేకంగా ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, కేయాన్‌లను అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం కథలు, నాటికలు, ప్రముఖుల రేడియో ప్రసంగాలను వినిపించేందుకు ప్రత్యేకంగా ‘మీనా ప్రపంచం’ పేరుతో రేడియోలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 860 పాఠశాలలు ఉండగా.. ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ఒక్కో కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్కో ల్యాబ్‌కు సుమారు 8 నుంచి 11 మానిటర్లు, సీపీయూలు, ప్రింటర్లు, విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక జనరేటర్లను సైతం ప్రభుత్వం సమకూర్చింది.
వీటికోసం ప్రత్యేకంగా ఒక గదిలో ఫర్నిచర్, కుర్చీలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కంప్యూటర్ విద్యను నేర్పే బాధ్యతను ఐదేళ్ల పాటు ఎన్‌ఐఐటీ సంస్థకు అప్పగించగా.. ఆ కాంట్రాక్టు 2013తో ముగిసింది. ఆ తర్వాత పాఠశాలలోనే కొందరు టీచర్లుకు బాధ్యతలు అప్పగించారు.
అయితే చాలా కంప్యూటర్లు మరమ్మతుకు గురవడం, సర్వీసింగ్ లేకపోవడంతో మూలకు పడ్డాయి. గతంలో వీటిపై విద్యార్థులకు ఎంఎస్ ఆఫీస్, ఫొటోషాప్, టైపింగ్ వంటివి నేర్పించేవారు. ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో అవన్నీ వృథాగా మారాయి.