Skip to main content

DOST 2024: దోస్త్‌ ద్వారా ప్రవేశాలు...... డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం

DOST 2024: దోస్త్‌ ద్వారా ప్రవేశాలు...... డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం
DOST 2024: దోస్త్‌ ద్వారా ప్రవేశాలు...... డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం

కోదాడ : డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్‌ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిచూపడంలేదు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోయే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు విడతల్లో దోస్త్‌ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు.

10 కాలేజీల్లో అడ్మిషన్లు నిల్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 24,000 సీట్లు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్ట్‌) ద్వారా గత నెల 6 నుంచి ప్రభుత్వం అడ్మిషన్లు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.ఇప్పటి వరకు నిర్వహించిన రెండు విడతల కౌన్సిలింగ్‌లో 3,699 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 10కి పైగా కళాశాలల్లో ఒక్కరూ కూడా చేరలేదు. 20 కళాశాలల్లో 10 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు చేరారరు. జిల్లాలోని మూడ కళాశాలల్లో మాత్రమే మూడంకెల స్థాయిలో విద్యార్థులు చేరారు. ఆయా కాలేజీలు ఇక మూడో విడత కౌన్సిలింగ్‌పై ఆశలు పెట్టుకున్నాయి. ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ వస్తే మూడో విడతలో విద్యార్థుల చేరుతారని భావిస్తున్నారు.

Also Read: Good News for 10th Pass Candidates

ఆదరణ కోల్పోయిన  సంప్రదాయ కోర్సులు

డిగ్రీ స్థాయిలో గతంలో ఎంతో ఆదరణ ఉన్న బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ కంప్యూటర్స్‌, బీఎస్సీ (బీజెడ్సీ), బీఏ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు మాత్రం ఇష్ట పడడం లేదు. ప్రస్తుతం డిగ్రీలో చేరిన వారిలో 50 శాతం మంది విద్యార్థులు కేవలం బీకాం బ్రాంచికి చెందినవారే కావడం గమనార్హం. కొన్ని కళాశాలలు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టినా విద్యార్థుల నుంచి ఆదరణ లభించడం లేదని పలు కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. పట్టణాల్లో లక్షల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ పది, ఇరవై మంది విద్యార్థులతో కళాశాలలు నడప లేక పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు మూసివేతకు సిద్ధమవుతున్నారు.

మూడో విడతలో చేరే అవకాశం

దోస్త్‌ ద్వారా నిర్వహించిన రెండు విడతల కౌన్సిలింగ్‌లో ఎంజీయూ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి కోర్సుల్లో అడ్మిషన్లు పూర్తికాకపోవడం, ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ రాకపోవడంతో తక్కువ మంది విద్యార్థులు డిగ్రీలో చేరారు. మూడవ విడతలో ఆశించిన స్థాయిలో విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.

                                                                – డాక్టర్‌ ఎ.రవి, దోస్త్‌, కోఆర్డినేటర్‌, ఎంజీయూ

Published date : 22 Jun 2024 09:28AM

Photo Stories