JEE Mains and Advanced : జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ఫలితాలతోనే ఈ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం.. త్వరలోనే..
దీంతో.. ఏటా లక్షల మంది ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో విజయం కోసం దీర్ఘకాలిక ప్రిపరేషన్ సాగిస్తున్న పరిస్థితి! త్వరలో జేఈఈ–మెయిన్ తేదీలు వెల్లడి కానున్న నేపథ్యంలో.. ఈ పరీక్ష విధానంతోపాటు సన్నద్ధత మెలకువలు..
జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం కోసం కనీసం ఏడాది ముందు నుంచే కృషి చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి టైమ్ మేనేజ్‌మెంట్ వరకూ.. అన్నింటిపైనా స్పష్టమైన అవగాహన తో ముందుకుసాగితే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.
మెయిన్ రెండు సెషన్లుగా
జేఈఈ–మెయిన్ పరీక్షను ఏటా రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 2025 జనవరిలో తొలి సెషన్, 2025 ఏప్రిల్‌లో రెండో సెషన్ నిర్వహించే అవకాశం ఉంది. అంటే జేఈఈ–మెయిన్ అభ్యర్థులకు పరీక్ష సమయం సమీపిస్తోంది. తొలి సెషన్‌కు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది.
మే మొదటి వారంలో అడ్వాన్స్‌డ్
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) క్యాంపస్‌ల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జేఈఈ–అడ్వాన్స్‌డ్. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి మే మొదటి వారంలో ఈ పరీక్ష జరిగే అవకాశం ఉంది. జేఈఈ–మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందిని జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఐఐటీలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండింటిలోనూ ఉత్తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
బోర్డ్ సిలబస్‌తో అనుసంధానం
జేఈఈ అభ్యర్థులు ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు.. బోర్డ్ సిలబస్, జేఈఈ–మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షల సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ముందుగా జేఈఈ–మెయిన్, బోర్డ్ పరీక్షలకు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్న టాపిక్స్‌ను అధ్యయనం చేస్తూ.. ఆయా పరీక్షలకు ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. మెయి న్, అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి అధికారిక వెబ్సైట్లో సిలబస్‌ను పరిశీలించి.. బోర్డ్ సిలబస్‌లో ఉన్న అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి.
జేఈఈ–మెయిన్స్‌తో కలిసి సాగేలా
జేఈఈ–అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు జేఈఈ–మెయిన్స్‌తోనూ కలిసి ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉన్న జేఈఈ–మెయిన్‌కు హాజరయ్యే విద్యార్థులు.. మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు ఉమ్మడి అధ్యయనం చేయాలి. ప్రతి ఏటా జేఈఈ–మెయిన్ రెండో సెషన్ ముగిశాక జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు నెల రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంటోంది.
అన్వయ దృక్పథం
జేఈఈ అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. తొలుత కాన్సెప్ట్‌లపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత వాస్తవ పరిస్థితుల్లో అన్వయం, అనంతరం ప్రశ్నల సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షలో అడిగే మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్, మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్ వంటి వాటికి సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
☛ Follow our Instagram Page (Click Here)
మెయిన్ తొలి సెషన్
జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ పరీక్షపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు పూర్తి స్థాయి సమయం కేటాయించాలి. ఒకవేళ జేఈఈ–మెయిన్ రెండో సెషన్‌కు కూడా హాజరయ్యే అభ్యర్థులు.. ఆ సమయంలో అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొశ్చన్స్, ప్రీవియస్ కొశ్చన్స్‌ను సాధన చేసేలా సమయ పాలన రూపొందించుకోవాలి.
ప్రతి వారం వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవుతూ లోటుపాట్లు సరిచూసుకుని వాటిని సరిదిద్దుకోవాలి. ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రాసుకునే విధానం అలవర్చుకోవాలి. ఫలితంగా రివిజన్ విషయంలో సమయం ఆదా చేసుకోవచ్చు.
సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యాంశాలు
మ్యాథమెటిక్స్
కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌పై దృష్టిపెట్టాలి. దీంతోపాటు 3–డి జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్,పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలపై పట్టు సాధించాలి.
ఫిజిక్స్
ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్,మోడ్రన్ ఫిజిక్స్,ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌పై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.
కెమిస్ట్రీ
కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
సమస్య సాధన
ప్రిపరేషన్ సమయంలోనే ఒక ప్రాబ్లమ్ లేదా ప్రశ్నను అంచెల వారీ సాధనపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది పరీక్షలో మూడు సబ్జెక్ట్‌ల నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతోపాటు, ఇంటిజర్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. కాబట్టి బిట్స్ సాధనకు పరిమితం కాకుండా ఒక ప్రాబ్లమ్‌ను స్టెప్ వైజ్‌గా పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచిస్తున్నారు.
పాత ప్రశ్న పత్రాల ప్రాక్టీస్
జేఈఈ అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ఆయా టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్న తీరు, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీని తెలుసుకోవచ్చు. ప్రశ్నలు అడిగే తీరును పరిశీలించడం ద్వారా ఒకే ఫార్ములా/కాన్సెప్ట్‌కు సంబంధించి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
జేఈఈ–మెయిన్ పరీక్ష విధానం
జేఈఈ–మెయిన్‌లో బీటెక్ అభ్యర్థులకు పేపర్–1, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు పేపర్–2ఎ, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల అభ్యర్థులకు పేపర్–2బి నిర్వహిస్తారు.
పేపర్–1 ఇలా: బీటెక్/బీఈ ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన ఈ పేపర్‌కు సంబంధించి మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో 90 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌లో 30 ప్రశ్నలు–వంద మార్కులకు, ఫిజిక్స్‌లో 30 ప్రశ్నలు–వంద మార్కులకు, కెమిస్ట్రీలో 30 ప్రశ్నలు–వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టును సెక్షన్ ఏ, సెక్షన్ బీలుగా నిర్వహిస్తారు. సెక్షన్–ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో)ఉంటుంది. సెక్షన్–బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఛాయిస్ విధానం నేపథ్యంలో సెక్షన్–బిలో 10 ప్రశ్నల్లో అయిదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్–ఎలో 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
☛ Join our Telegram Channel (Click Here)
జేఈఈ–అడ్వాన్స్‌డ్ ఇలా
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. వీటిని పేపర్–1, పేపర్–2లుగా పేర్కొంటారు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 17 ప్రశ్నలు చొప్పున 51 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపర్‌కు 180 మార్కులు చొప్పున రెండు పేపర్లను కలిపి 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ఏటా అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంలో గత మూడేళ్లుగా ఎలాంటి మార్పులు జరగలేదు.
Tags
- JEE Mains and Advanced
- Entrance Exams
- admissions
- inter students
- iiit and iit admissions
- advanced exams
- nit admissions 2004
- JEE Mains exam preparations
- advanced jee
- NIT IIIT and IIT college admissions
- advance rankers
- mains eligibles
- Education News
- Sakshi Education News
- JEE Main 2024
- JEE Advanced 2024
- NITs admission criteria
- IITs admission process
- IIITs entrance exam
- Engineering entrance exams
- JEE Main dates announcement
- Long-term JEE coaching
- SakshiEducationUpdates