Skip to main content

TS Schools Reopening Date and New Timings 2024 : జూన్‌ 12వ తేదీ పాఠ‌శాల‌లు ప్రారంభం.. మారిన స్కూల్స్ టైమింగ్స్ ఇవే.. అలాగే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్ విద్యార్థులకు త్వ‌ర‌లోనే వేస‌విసెల‌వులు ముగియ‌నున్నాయి. జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Telangana Schools Update  School reopening in Telugu states on June 12  ts schools reopening date and new school timings in telangana  Updated school hours for primary and secondary schools in Telangana

అయితే ఈ సారి తెలంగాణ‌లో ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలు మారాయి.  2022-23 విద్యాసంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకునేవి. గత విద్యాసంవత్సరం(2023-24)లో 9.30 గంటలకు ప్రారంభమయ్యేలా మార్చారు. 

సర్కారు బడులపై..
ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు వెళ్లడం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచే పనిచేస్తాయి. వాటి పనివేళలను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటలకు తెరిస్తే సాయంత్రం 4.45 గంటల వరకు విద్యార్థులు బడిలోనే ఉండాల్సి ఉంటుందని, చలి, వర్షాకాలాల్లో వారు ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమై, బాలికలకు రక్షణ కరవవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అకడమిక్‌ క్యాలెండర్‌లో..
ఈ సారి పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. విద్యాహక్కు చట్టం-2009 ప్ర‌కారం తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండరును విడుదల చేసి.. మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. 

అలాగే ఆరు, ఏడు తరగతులకు..
6,7 తరగతుల గణితం సబ్జెక్టును ఇక నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రెండు తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని..
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ ఇలా అన్ని రకాల పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని, అందుకు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రధానోపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఈ సారి కూడా నో బ్యాగ్ డే..
ఈ సారీ ప్రతి నెలా 4వ శనివారం నో బ్యాగ్‌ డేను అమలుచేయాలి. రోజూ 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలి. జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయాలి.

స్కూల్స్‌కు 2024-25లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..
2025లో స్కూల్స్‌కు ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది. 

ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇవే..
మరోవైపు.. 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్‌ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.

Published date : 27 May 2024 04:32PM

Photo Stories