National Medical Commission: చేరిన వైద్య కళాశాలలోనే చదువు పూర్తి.. ఇకపై ఇంటర్న్‌షిప్‌ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ వైద్య విద్యలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పలు కీలక మార్పులు చేసింది.
చేరిన వైద్య కళాశాలలోనే చదువు పూర్తి.. ఇకపై ఇంటర్న్‌షిప్‌ ఇలా..

2023–24 వైద్య విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల బదిలీలు, ఇంటర్న్‌ షిప్, ఇతర అంశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌన్సెలింగ్‌ ద్వారా సీటు వచ్చిన కళాశాలల్లో చేరి, రెండో ఏడాదిలో పలువురు విద్యార్థులు మరోచోటికి బదిలీ చేయించుకుంటున్నారు. ఈ విధానాన్ని ఎన్‌ఎంసీ ఎత్తివేసింది. ఎంబీబీఎస్‌ చదివిన వారు ఇకపై పదేళ్ల కాల పరిమితిలో కాకుండా రెండేళ్లలోనే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి. పైగా ఏ వైద్య కళాశాలలో చేరితే అక్కడే ఇంటర్న్‌షిప్‌ను చేయాల్సి ఉంటుంది. కొంతమంది తాము చదివిన కాలేజీల్లో కాకుండా.. మరోచోట చేస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు తప్పకుండా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్స్ట్‌) రాయాల్సి ఉంటుంది.

చదవండి: Medical Counselling Committee: ఒకేసారి ఆల్‌ ఇండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌!

2019లో ఎంబీబీఎస్‌లో చేరిన వారికి ఈ సంవత్సరం కూడా ప్రస్తుత విధానంలోనే పరీక్షలు జరుగుతున్నాయి. తరువాత సంవత్సరాల్లో చేరిన వారికి ఎప్పటి నుంచి ‘నెక్స్టŠ’ విధానం అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్‌ ఉమ్మడి ప్రవేశాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల వెలువడిన నీట్‌ ఫలితాలకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితాలు త్వరలో కేంద్రం నుంచి రానున్నాయి. ఇవి వచ్చిన అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు షెడ్యూల్‌ ప్రకటిస్తాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. 

చదవండి: Pharmacy Council of India: పారా మెడికల్‌ పరిధిలోకి ఫార్మసీ వృత్తి రాదు

#Tags