Inspirational Story: కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపికైన జోయా మీర్జా..
కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా..
కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’.. ఇలా ఉండేవి ఆమె కలలు.
కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి.. జోయా మీర్జా. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్‌ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.
అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.
‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు.
‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ప్రాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.
తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.
‘భిలాయ్ కోచింగ్ సెంటర్‌లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్‌ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.
‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు.. ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.
తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో..
‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.
‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా.