BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ 25వ స్నాతకోత్సవం.. కొత్త కోర్సులు ప్రారంభం..

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవం డిసెంబ‌ర్ 28న విశ్వ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి కె.సీతారామారావు తెలిపారు.

యూనివర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటాచక్రపాణి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఏవీఎన్‌ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి పి.వెంకటరమణతో కలిసి ఆయన డిసెంబ‌ర్ 26న‌ విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విచ్చేసి విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు, ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, బుక్‌ప్రైజ్‌లను అందిస్తారని వెల్లడించారు.

చదవండి: BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ హాజరై ప్రసంగిస్తారన్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ వీఎస్‌ ప్రసాద్‌ను డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (హానరిస్‌ కాసా–గౌరవ డాక్టరేట్‌)తో సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 31,729 మంది విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికెట్లు పొందనున్నారని సీతారామారావు వెల్లడించారు.
డిగ్రీలో 17, పీజీలో 26 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలలోని వివిధ జైళ్లలో ఉండి ఈ యూనివర్సిటీలో చదువుకొని 148 మంది ఖైదీలు డిగ్రీ పట్టాలు పొందనున్నారని వెల్లడించారు. డిగ్రీలో ఒక ఖైదీ గోల్డ్‌మెడల్, బుక్‌ప్రైజ్‌ అందుకోనున్నట్లు చెప్పారు.  

వర్సిటీల్లో కొత్త కోర్సులు.. 

కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడమే కాకుండా 2019–22 విద్యా సంవత్సరం నుంచి యూజీ స్థాయిలో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌పై యూనివర్సిటీ దృష్టి సారించిందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పీజీ, సెమిస్టర్‌ ప్రోగ్రామ్, ఎంఏ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, ఎంఏ అర్బన్‌ ప్లానింగ్‌ డెవలప్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ ప్రీ ప్రైమరీ టీచర్‌ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్‌ ఈ–గవర్నెన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ యాంకరింగ్, డబ్బింగ్, వాయిస్‌ ఓవర్, పీజీ డిప్లొమా ఇన్‌ లీగల్‌ అవేర్‌నెస్‌ తదితర కోర్సులు ప్రవేశ పెడుతున్నామని సీతారామారావు తెలిపారు.  

#Tags