Tina Dabi, IAS : నవ్వేవాళ్లని నవ్వనీ.. ఏడ్చేవాళ్లను ఏడవనీ.. ఐ డోంట్ కేర్..
దేశంలో తొలిసారిగా మొదటి ర్యాంక్ సాధించిన 22 ఏళ్ల దళిత మహిళగా రికార్డు సృష్టించింది.అతి చిన్న వయసులోనే ఈ ర్యాంకును సాధించడం మరో విశేషం. అలాగే తొలి ప్రయత్నంలోనే ర్యాంకు కొట్టేసింది. డిగ్రీ తర్వాత నేరుగా సివిల్స్ ఎంపికై మరో రికార్డు నెలకొల్పింది. ఇలా టీనా గురించి చెబుతూపోతే రికార్డులే రికార్డులు. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే క్లిష్టమైన సివిల్స్ ర్యాంకు మీ సొంతమవుతుందని ఆమె చెబుతోంది. టీనా దాబీ చెప్పిన మరికొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..
ఇలా స్మార్ట్‌గా చదివితే చాలు...సివిల్స్ ఈజీనే..
సివిల్స్ పరీక్షల కోసం నిద్రాహారాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. చక్కటి ప్రణాళికతో స్మార్ట్‌గా చదివితే చాలు ర్యాంకులు వాతంట అవే వస్తాయి. నేను ఇదే సూత్రాన్ని పాటించాను. సివిల్స్ కోసం నా ఇష్టాలను వేటినీ వదులు కోలేదు. చివరికి వాట్సప్, ఫేస్‌బుక్‌లకూ దూరం కాలేదు. కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేశాను. రోజుకు ఐదు ఆరు గంటలు ఏకాగ్రతతో చదివాను. అలసట వచ్చినప్పుడు రిలాక్స్ కోసం వాట్సప్, ఫేస్‌బుక్ చేసేదాన్ని. అంతే కానీ ఒక చేత్తో మొబైల్, మరో చేతిలో పుస్తకంతో కూర్చునేదాన్ని కాదు. కావల్సినంత సేపు నిద్రపోయేదాన్ని.
తెలుగు హీరో ప్రభాస్‌కి వీరాభిమానిని..
నేను తెలుగు హీరో ప్రభాస్‌కి వీరాభిమానిని. బాహుబలి సినిమా చూడటం కోసం రెండు మూడు రోజులు ముందుగానే చదువు కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇలా సమయాన్ని స్మార్ట్‌గా వినియోగించుకునేదాన్ని.
నా విజయానికి మూడు మెట్లు...
నా విజయంలో మూడు అంశాలు కీలకపాత్ర పోషించాయి. అవి కష్టపడి పని చేయడం, చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, ఓపిగ్గా ఉండటం. ఈ మూడు అంశాలను పాటిస్తే ర్యాంకులు సులభంగా పొందవచ్చు.
నా విషయంలో తల్లిదండ్రులు...
నాకు ఇంటర్మీడియెట్‌లోకి వచ్చే వరకు సివిల్స్ గురించే తెలియదు. తొలిసారిగా ఇంటర్ మొదటి సంవత్సరంలో సివిల్స్ గురించి తెలిశాక అప్పటి నుంచే నేను ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నా. కేవలం పరీక్షలు, మార్కులు కోసం చదవలేదు. చదివిన దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించే వరకు వదిలేదాన్ని కాదు. నా విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. మిగిలిన తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోండి. మీ ఇష్టాలు, అభిప్రాయాలను వారిపై రుద్ది ఒత్తిడికి గురి చేయొద్దు.
నా కల ఇదే..కానీ
భారత ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ అవడం టీనా దాబీ కల. ఆ కల అటుండగనే అంతకంటే పెద్ద కల ఆమెను కనింది! టీనాను ‘బ్రిక్స్’ గౌరవ సలహాదారుగా బ్రిటన్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలను తిప్పుకు రావడానికి ఆ రెక్కల గుర్రం ఇంటి బయట సిద్ధంగా ఉంది! ఇండియా సహా బ్రిక్స్‌లోని ఐదు దేశాలు ఇవి. టీనా ప్రస్తుతం రాజస్థాన్‌లో కేడర్‌లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమె రాజస్థాన్ నుంచి కదిలేదేమీ ఉండదు. బ్రిక్స్ స్టీరింగ్ కమిటీకి సలహాలు అవసరమైనప్పుడు ఈ ఐఎఎస్ ఆఫీసర్‌కు కాల్ చేస్తోంది. వెబ్ మీటింగ్‌లకు ఆహ్వానిస్తుంది.
అన్నీ వింటూ హాయిగా నవ్వడమే..
వెనుక చాలా మాటలు. రిజర్వేషన్ క్యాండిడేట్. చూసి ప్లాన్ చేసుకుంది. సొంత ప్రతిభేమీ కాదు. అంతా పేరెంట్స్ పలుకుబడి. ఇప్పుడు ‘బ్రిక్స్’ చాన్స్. అదీ అంతే.. సిఫారసు. ఒక మాట కాదు!! అన్నీ వింటూ హాయిగా నవ్వడమూ.. మాటలు కాదు!
ఆ కమిటీలో ఒక్కగానొక్క ఐఏఎస్ ఆఫీసర్ టీనా. ఇరవై ఏడేళ్ల అమ్మాయి. అవును. అమ్మాయిలానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ..ఎప్పుడూ హుషారుగా డ్యూటీ చేస్తూ ఉంటుంది. భిల్వారాలోకి కరోనా చొరబడకుండా టీనా సరిహద్దుల్లో గట్టి బందోబస్తు పెట్టించిందని.. ఆమె పేరు భిల్వారా నుంచి గట్టిగా దేశానికి వినిపించింది.
సలహా ఇవ్వడమే..
బ్రిక్స్ కమిటీ గౌరవ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా. బ్రిక్స్‌కి సలహా ఇవ్వడం అంటే జైర్ బొల్సనారోకి, వ్లాదిమర్ పుతిన్‌కి, నరేంద్ర మోదీకి, షి జిన్‌పింగ్‌కి, సిరిల్ రమాఫోసాకు సలహా ఇవ్వడమే. ఐదు దేశాల వాణిజ్యం, పరిశ్రమలు, రాజకీయాలు, సహకారం.. వీటి మీద కమిటీని టీనా తన సూచనలతో నడిపించాలి. ఏటా ఒక్కో ‘బ్రిక్స్’ దేశంలో సదస్సు జరుగుతుంది.
చదువులోనూ..
టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బి.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. అక్కడా టాపరే. ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే ఐ.ఎ.ఎస్.కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు తొమ్మిది నుంచి పన్నెండు గంటల ప్రిపరేషన్! డిగ్రీ అయిన రెండేళ్లకే సర్వీస్ కమిషన్ పాస్ అయ్యారు. ట్రయినింగ్ ముస్సోరీలో. అక్కడే ఆమెకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్, ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ వచ్చాయి. అక్కడే ఆమిర్ ఉల్ షఫీఖాన్ పరిచయం అయ్యాడు.
ప్రేమ..పెళ్లి..విడాకులు :
తన జూనియర్ అయిన అమీర్‌ను టీనా ప్రేమించింది. అమీర్‌కు సివిల్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ కొన్ని అనివార్య వివాదాల నడుమ 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వీరి ప్రేమ వివాహం జరిగింది.ఆమిర్‌కు రాజస్థాన్‌లోనే పోస్టింగ్. జమ్ము కశ్మీర్ అడిగితే అక్కడ ఖాళీల్లేవని ఇక్కడ ఇచ్చారు. టీనాకూ అలాగే జరిగింది. ఆమె హర్యానా అడిగితే రెండో ఆప్షన్‌గా ఉన్న రాజస్థాన్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టం. ఇద్దరూ సాహితీ ప్రియులే. ఆయన పొయెట్రీ రాస్తారు. ఈమె ఇంగ్లిష్ నవలలు చదువుతారు. ఐఏఎస్ ప్రేమపక్షులు అథర్ ఆమిర్ ఉల్ షఫీఖాన్, టీనా దాబీ తమ వివాహ బంధంపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివాహమైన రెండేళ్లకే దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారగా.. ఇప్పుడు విడాకుల వార్త కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్లు విడాకులతో విడిపోయారు.
కుటుంబ నేపథ్యం :
టీనా తండ్రి జస్వంత్ దాబి బి.ఎస్.ఎన్.ఎల్.లో జనరల్ మేనేజర్. తల్లి హిమానీ దాబీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అధికారి. పిల్లల కోసం ఉద్యోగం మానేశారు. మీనాకు రియా అని ఒక చెల్లి. ఈ కుటుంబానిది భోపాల్. టీనా చిన్నప్పుడే ఢిల్లీ వచ్చి స్థిరపడ్డారు.
ప్రతిచోటా ఆమెకు..
ఈమె ఎటువంటి ట్రోల్స్‌ని చూసి ఎప్పటిలా నవ్వుకుని వదిలేస్తున్నారు టీనా. ఆమె ప్రతిభావంతురాలు కాకపోయుంటే ఆ సంగతి ఎక్కడో ఒక చోట బయట పడి ఉండాలి. స్కూల్లోనో, కాలేజ్‌లోనో, క్యాంపస్‌లోనో, ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్‌లోనో, ఎస్డీఎంగా ఇప్పుడు పని చేస్తున్న హోదాలోనో! ప్రతిచోటా ఆమెకు మంచిపేరే ఉంది. మంచి మార్కులే పడుతున్నాయి. దళితురాలు కనుక ఏమైనా ప్రచారం చెయ్యొచ్చు అనుకుంటే ప్రతిభ చూస్తూ కూర్చోదు. పై స్థాయికి చేరుస్తూనే ఉంటుంది.. ఏడ్చేవాళ్లను ఏడవనివ్వమని.