Surya Sai Praveen Chand,IAS : అమ్మ చెప్పిన ఈ మాట కోసమే ఐఏఎస్ సాధించా..

కలెక్టర్‌ అయితే ప్రజలకు మంచి చేయొచ్చని చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట ఆయన మదిలో నిలిచిపోయింది.
Surya Sai Praveen Chand, IAS

ఆ మాటే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని మరిచి చదివేలా స్ఫూర్తి నింపింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమైనా లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. అమ్మ ఆశయం కోసం పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో 64వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. ఐఏఎస్‌ అధికారిగానూ వినూత్నంగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయనే విజయవాడ సబ్‌ కలెక్టర్‌ గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

కుటుంబ నేప‌థ్యం:
గోకరకొండ వెంకటేశ్వరరావు, పద్మావతి నా తల్లిదండ్రులు. నా ఎనిమిదో ఏటనే ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మా అమ్మ, ఐఐటీ చదువుతుండగా క్యాన్సర్‌తో నాన్న ఈ లోకాన్ని వీడారు. 

చ‌దువు : 
అమలాపురంలో మదర్‌థెరిస్సా స్కూల్‌లో 545 మార్కులతో పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చాను. విశాఖపట్నంలో ఎంపీసీ విభాగంలో ఇంటర్‌ పూర్తిచేశా. పాట్నా ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ చేశాక యూఎస్‌లో పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. 

ఉద్యోగం చేస్తూనే..ఐఏఎస్‌కు..


ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో బెంగళూరులోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరా. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీర్చాల్సి ఉండటంతో మొదటి రెండు సార్లు ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్‌కు సన్నద్ధమయ్యాను. కచ్చితంగా మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకంతో మూడో విడత ఉద్యోగం వదిలేసి సానుకూల దృక్పథంతో శిక్షణ పొందాను. అదే నన్ను విజయ తీరాలకు చేర్చింది. ఐఏఎస్‌లో 64వ ర్యాంకుతో అమ్మ ఆశయాన్ని నెరవేర్చేలా చేసింది.  

ప్ర‌తి సమస్యా పరిష్కారయ్యే వరకు.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అనేక రకాల సమస్యలను నా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించి ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తున్నా. ప్రతి సమస్యా పరిష్కారయ్యే వరకు పర్యవేక్షించే వ్యవస్థను కార్యాలయంలో ఏర్పాటు చేశాను. నా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారమైందీ, లేనిదీ తరచూ పరిశీలిస్తున్నా.  

ఒక్క రోజు తప్పనిసరిగా.. 
వారంలో ఒక్క రోజు తప్పని సరిగా ఏదో ఒక గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పీహెచ్‌సీని తనిఖీ చేస్తున్నా. మధ్యాహ్నం స్కూలులోనే భోజనం చేసి నాణ్యతను పరిశీలిస్తున్నాను. విద్యార్థులే భావి తరాలకు ఆశాజ్యోతులు కనుక తనిఖీల సమయంలో వారిని ప్రశ్నలు అడగటం, అప్పటి సందర్భాన్ని బట్టి గణితం, ఇతర అంశాలను బోధిస్తూ చదువుపై ఆసక్తి పెంచేందుకు కృషిచేస్తున్నా. పీహెచ్‌సీలను తనిఖీ చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకొంటున్నా.

ప్రాక్టికల్‌గా చూడాలనే..ఇలా చేసా..
నందిగామ ప్రాంతంలో ఓ పాఠశాలలో వాటర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఒక విద్యార్థి దానిపైకి ఎక్కి విద్యుత్‌ తీగలు తగిలి చనిపోయాడు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకొనేందుకు నేను ఆ స్కూలుకు వెళ్లాను. ఆ విద్యార్థి వాటర్‌ ట్యాంకును ఎలా ఎక్కాడో ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలని నేనూ వాటర్‌ ట్యాంకు ఎక్కాను. అక్కడ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని భావించాను. క్షేత్ర స్థాయిలో ప్రజలకు స్ఫూర్తిదాయక సేవలు అందించాలనే లక్ష్యంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 

అందుకే అర్ధరాత్రి సమయంలో..
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌)లో మార్పులకు శ్రీకారం చుట్టాను. రోగులకు అందుతున్న వైద్యసేవలను ఏ క్షణమైనా పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించా. ఐదు లోపు ఉన్న ఓపీ కౌంటర్ల సంఖ్యను 18కి పెంచాను. రాత్రి సమయాల్లో రోగులను వైద్యులు సరిగా పట్టించుకోరనే భావన ఉంది. అందుకే అర్ధరాత్రి సమయంలో పలు మార్లు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశాను. డాక్టర్లు షిఫ్ట్‌ మారే సమయంలో రోగులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఓపీ సమయంలో డాక్టర్లు ఉన్నదీ, లేనిదీ గమనిస్తున్నాం. గతంలో వివిధ పరీక్షల ఫలితాలను మాన్యువల్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు కంప్యూటరీకరణ చేశాను. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నాం. దీని ద్వారా వచ్చే నిధులతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి, రోగులకు మెరుగైన వైద్యం అందించొచ్చన్న భావనతో చర్యలు తీసుకుంటున్నాం.  

రైతు వేషంలో వెళ్లి..


ఎరువుల దుకాణాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే సమాచారంతో, కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశాల మేరకు నాపక్క డివిజన్‌లోని కైకలూరులో ఎరువుల దుకాణాలకు రైతు వేషంలో వెళ్లి తనిఖీలు చేశాను. ఓ దుకాణంలో ఎరువులు కొంటే బిల్లుకు బదులు స్లిప్‌లో రాసి ఇవ్వడాన్ని గమనించాను. ఆధార్‌ కార్డు ద్వారా ఎరువులు విక్రయించాలంటే వ్యాపారులు కుదరదన్నారు. ప్రభుత్వం పేర్కొన్న, వసూలు చేస్తున్న ధరల్లో వ్యత్యాసం ఉంది. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలను తనిఖీల వ్యాపారులకు పంపడంతోపాటు, అధికారులపై రైతులకు నమ్మకం కలిగేలా చేశాం. ఇప్పటికీ రైతులు తరుచూ నాకు ఫోన్‌ చేస్తూనే ఉంటారు.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

#Tags