ఆచార్య దేవో భవ...
ఎంత పేదరికం నుంచి వచ్చినా ఉన్నతమైన ఆలోచనలతో స్కాలర్‌షిప్‌ల సహాయంతో ఆయన చదువుకున్నాడు. చదివించే స్తోమత లేక తండ్రి కొడుకును పూజారిగా చేద్దామనుకున్నా, కుర్రవాడి జిజ్ఞాసను చూసి స్కూలుకు పంపించారు. ఇరవై సంవత్సరాలకే మహాసముద్రం లాంటి ఫిలాసఫీని ఔపోసన పట్టి విద్యార్థులకు బోధించటం ప్రారంభిస్తే ఆయన పాఠాలు వినటానికి విద్యార్థులే కాక సహోపాధ్యాయులు కూడా కిటికీల వద్ద నిలబడి వినేవారు. ఆయన విద్యార్థుల అభిమానాన్ని ఎంతగా చూరగొన్నారంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బోధించటానికి తను పనిచేస్తున్న కళాశాల వదిలి వెళుతుంటే విద్యార్థులంతా కళాశాల నుంచి రైల్వేస్టేషన్ వరకూ పూలమాలలతో నిండిన బండిని స్వయంగా తమ చేతులతో లాక్కెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి అతిథిగా ఒకటి రెండు ఉపన్యాసాలు ఇవ్వటానికి వెళ్లిన ఆయన ఉపన్యాసాలను విని సమ్మోహితులైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యంత్రాంగం ఆయన కోసం ప్రత్యేకంగా పదవిని సృష్టించి అక్కడే ఉండిపొమ్మని అభ్యర్థించింది. అలాంటి పదవులన్నీ తృణప్రాయంగా వదిలేసి స్వదేశంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి కృషిచేసి, విద్య అనేది జీవించటానికి ఏం చేయాలో నేర్పటమే కాక, ఎలా జీవించాలో కూడా నేర్పాలన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రవచించారాయన. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ఆయనను కలిసి మీ జన్మదినాన్ని వేడుకగా జరుపుకోవటానికి అనుమతి అడిగిన ఆయన విద్యార్థులు, శ్రేయోభిలాషులతో ఆయన ‘‘నేను నిరంతరం విద్యార్థిగా ఉండే ఉపాధ్యాయుడ్ని. మీరు వేడుక చేయదలిస్తే అలా నిరంతరం విద్యార్థులుగా ఉండి తమ ఉపాధ్యాయ వృత్తి ద్వారా మేధావులను తయారు చేస్తున్న ఉపాధ్యాయ వృత్తికీ వేడుకలు జరపండి.’’ అని అన్నారు. ఆరోజు నుంచే సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
స్వగృహే పూజ్యతే మూర్ఖః
స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
మూర్ఖుడు, తన ఇంటిలోనే పూజలందుకుంటాడు. గ్రామపెద్ద తన గ్రామంలోనే పూజలందుకుంటాడు. రాజు తన దేశంలో మాత్రమే పూజలందుకుంటాడు. విద్వాంసుడు ఎక్కడికెళితే అక్కడ పూజలందుకుంటాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డాక్టర్ రాధాకృష్ణన్. జీవితంలో ఒక్కసారైనా ఒక గొప్ప అధ్యాపకుడి చేతిలో పడితే ఆ వ్యక్తి గొప్ప నాగరికుడిగా మారే అవకాశం ఉందంటారు Bertrand Russel. ఈ విషయాన్ని బహుశ పురాణాల్లో హిరణ్యకశిపుడు కూడా గ్రహించినట్లుంది. అందుకే...
చదువని వాడజ్ఞుండగు
చదివిన సద సద్వివేక చతురతగలుగున్
చదువగవలయును జనులకు
చదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!!
అంటాడు కుమారుడైన ప్రహ్లాదునితో. అంత రాక్షసుడిగా పేరొందిన హిరణ్యకశిపుడే గురువుల గొప్పతనం గ్రహించాడు.
‘‘ఆకాశం ఎత్తులో ఉన్న ఈ ‘గురు’ శబ్ధం భూలోకంలో పడి అటుపై చిత్రసీమలో స్వైరవిహారం చేసి అక్కడ కూడా అవమానాలకు, వెక్కిరింతలకు గురై ఎక్కడా తలదాల్చుకోలేక పాతాళంలో పడిపోయిన ఈ రోజుల్లో గురు శబ్ధం ఎవరైనా పలుకుతుంటే వెక్కిరింతగా వినిపిస్తోంది’’ అనే పులికింటి మాటలు ఈనాటి కాలంలో అందరికీ ఆలోచనీయాంశం. గురువు ఆజ్ఞ పాటించటానికి పొలంలో నుంచి నీరు పోకుండా, పగలు రాత్రి పొలానికి అడ్డంగా తానే గట్టై పడుకున్న అరుణి (మహాభారతంలోని ఉపాఖ్యానంలో పేర్కొన్న పాత్ర) కాలంనాటికి... ఈనాటికి గురుశిష్య సంబంధంలో వచ్చిన విపరీతమైన మార్పునకు పులికంటి మాటలే ఉదాహరణ. ‘‘జీతం పుచ్చుకోవటం వల్ల ఉపాధ్యాయులు సేవకులు అవుతున్నారు, వేతనం ఇస్తుండటంతో విద్యార్థులు ప్రభువులవుతున్నారు’’ అని అన్న కందుకూరి మాటలు కూడా ఈ కాలం విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులందరినీ ఆత్మావలోకనం చేసుకోవటానికి ప్రేరేపించేవే. సాధారణ గురువులు సమాచారాన్ని ఇస్తారు. మధ్యస్థమైన గురువులు జ్ఞానాన్ని ఇస్తారు. గొప్ప గురువులు స్ఫూర్తిని ఇస్తారు.
విశాఖపట్నం ఎ.వి.ఎన్. కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజులవి. టీనేజి ఆకర్షణలు, ఎదిగీ ఎదగని వ్యక్తిత్వం, అంతర్గతంగా అంతులేని సంఘర్షణలతో, ప్రతి విద్యార్థి సతమతమయ్యే సమయమది. సంస్కృతం క్లాసు తీసుకుంటున్న గురువు గారు పురాణాల్లో మహర్షుల గురించి చెబుతూ.. తపస్సు ద్వారా సాధించలేనిది ఏదీ లేదన్నారు. కొందరు విద్యార్థులు గురువు గారిని ఇరుకున పెట్టడానికి పురాణ కాలంలో తపస్సు ఎలా చేసేవారో తాము చూడలేదనీ, ఈ మధ్యకాలంలో మన దేశంలో తపస్సు చేసినవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పమని అడిగారు. గురువు గారు ఆలోచించి ‘గాంధీజీ’ అని సమాధానమిచ్చారు. గాంధీజీ తపస్సు చేశారనటానికి నిదర్శనం ఏంటి? అని అడిగారు ఆ విద్యార్థులు. అప్పుడు గురువు గారు గాంధీజీ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు. ఒకసారి గాంధీజీకి, రవీంద్రనాథ్ ఠాగూర్‌కి మధ్య సూర్యోదయ సమయంలో సంభాషణ జరుగుతోంది. ఉదయభానుని లేత కిరణాలతో ప్రభావితుడైన ఠాగూర్, గాంధీజీ ఏదో ధ్యాసలో ఉండటం గమనించి ‘‘గాంధీజీ మీరెందుకంత నిశ్చలంగా ఉంటారు? సూర్యోదయం వేళ ఉదయభానుడి లేత ఎర్రని కిరణాలు చూస్తే మీ మనసు నిండిపోదా? పక్షుల కిలకిల రావాలతో ఆ సహజ సంగీతంతో మీ హృదయం పరవశించదా? విచ్చుకుంటున్న ఎర్ర గులాబీలను చూస్తే ఆహ్లాదంగా అనిపించదా?’’ అని ప్రశ్నించారు. దానికి గాంధీజీ ‘‘గురుదేవ్ నేనేమీ జీవంలేని శిల్పాన్ని కాదు కదా. ఉదయభానుడి ఎర్రని కిరణాలతో, పక్షుల కిలకిల రావాలతో, విచ్చుకునే గులాబీలతో పరవశించకుండా ఉండటానికి. కానీ నేనేమి చేయను? నా మనసంతా వేరేచోట ఉంది. ఆ లేత గులాబీ ఎర్రదనాన్ని ఆకలితో అలమటించే కోట్లాది జీవుల చెక్కిళ్లపై ఎప్పుడు చూస్తానా అని... ఆనందం నిండినవారి గొంతుల్లో నుంచి ఆ పక్షుల కిలకిల రావాల్లాంటి మధుర ధ్వని ఎప్పుడు వింటానా అని... ఉదయభానుని లేత కిరణాలతో ఆ పేదవాని హృదయం (అతని సమస్యలు తీరి) ఎప్పుడు పరవశిస్తుందా’’ అని అన్న గాంధీజీ సమాధానానికి ఠాగూర్ మిన్నకుండిపోయారు. అందుకేనేమో దేశం కోసం, దేశప్రజల కోసం అంతగా తపించిన గాంధీజీని ‘మహాత్మా’ అని సంబోధించారు. తపస్సు అంటే లక్ష్యం కోసం అనునిత్యం తపించటమే అని వివరించారు గురువుగారు. స్ఫూర్తి ప్రదాయకమైన ఆయన సమాధానంతో ప్రశ్న అడిగినవారి గొంతు పెగల్లేదు కానీ, మిగతా వారందరి నుంచి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. జీవితాంతం స్ఫూర్తిని ఇచ్చే మా గురువుగారి వివరణ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో?!
ప్రపంచంలో మిగతా అన్ని వృత్తులను నేర్పించే వృత్తే ఉపాధ్యాయ వృత్తి. ఇంజినీర్లయినా, డాక్టర్లయినా, లాయర్లయినా, సైంటిస్ట్‌లైనా, ప్రధానమంత్రులైనా, రాష్ట్రపతులైనా, ఉపాధ్యాయుడి శిక్షణ నుంచి వచ్చినవారే. వేమన అన్నట్లు..
గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగును
అజునికైన, వానియబ్బకైన,
తాళపుచెవి లేక తలుపెట్టులూడును,
విశ్వదాభిరామ వినురవేమ
‘‘గురువు లేకుండా ఎంతటి వారికైనా గొప్పదనం సిద్ధించదు. రఘువంశ రాజైన అజుడైనా.. ఆయన తండ్రైనా, ఎవరైనా సరే. తాళంచెవి లేకుండా తలుపు తీయటం ఎలా సాధ్యం?’’ అని అర్థం. అంటే అజ్ఞానం అనే తాళం కలిగిన విద్యార్థి అనే ద్వారానికి, జ్ఞానం అనే తాళంచెవితో తలుపు తీసేవాడే గురువుగారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు. ఆ జన్మని సార్ధకం చేసుకునేలా ప్రేరణ ఇచ్చేది గురువు కాబట్టి గురువే జీవితానికి చుక్కాని లాంటి వాడు.
బుద్ధుడు మహా సమాధిలోనికి ప్రవేశించేటప్పుడు ఆయన శిష్యులందరిలో తీవ్ర ఆవేదన ఆవరించింది. అశ్రువులతో అందరూ గద్గద స్థితిలో ఉన్నారు. బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు ఆయన దగ్గరకు వెళ్లి, మహాత్మా మీరు ఇన్నాళ్లూ మా అందరికీ మార్గం చూపించారు. అజ్ఞానాంధకారంలో నుంచి జ్ఞాన ప్రకాశంలోకి మమ్మల్ని పయనింప చేశారు. మీరు నిష్ర్కమిస్తే మాకు మార్గం ఎవరు చూపుతారు? అంటూ రోదించాడు. అందుకు బుద్ధుడు సమాధానంగా ‘నా జీవితంలో నేను ఆచరించింది, అనుభవంతో తెలుసుకున్నది మీకు బోధించాను. నా జ్ఞానాన్ని మీ హృదయాల్లో నాటటానికి ప్రయత్నించి నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. నా తర్వాత వెలుగు కోసం నీలో నువ్వు చూసుకో. ఆత్మదీపోభవ (Be your own lamp) ’అంటారు. నిజమైన గురువు, నిజమైన శిష్యులకు వీరే ఉదాహరణ.
ప్రతి విద్యార్థి సగటున 25 వేల గంటల సమయాన్ని కళాశాల ఆవరణలో గడుపుతాడు. కాబట్టి అతనికి అత్యున్నత విలువలు కలిగిన ఉపాధ్యాయుల బోధన అవసరమంటారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడి ప్రభావం ఎన్ని తరాల వరకు ఉంటుందో చెప్పలేం. ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ప్రొఫెసర్ నాగమునీశ్వరరావు ఎలక్ట్రానిక్స్ బోధించేవారు. ఆయన క్లాస్‌కి వచ్చిన సమయం ఆధారంగా విద్యార్థులు వాచ్‌లు సరిదిద్దుకునే వాళ్లు. అంత కచ్చితంగా ఉండేది ఆయన సమయపాలన. విద్యార్థికి పఠనం, మననం, రెండూ అవసరమని నొక్కి చెప్పేవారు. ఆయన అంటే అందరికీ గౌరవంతో కూడిన భయం ఉండేది. ఒక క్లాస్‌లో ఆయన చెప్పిన కథ ఇప్పటికీ గుర్తుంది. ఒక తాత, పిల్లలకు కబుర్లు చెబుతున్నాడు. గొప్పవాళ్లు ఎలా అవుతారు అని అడిగారు పిల్లలు. దానికి తాత ప్రతి మనిషిలోనూ రెండు జట్లు ఉంటాయి. నాలోనూ, మీలోనూ కూడా ఉన్నాయి. ఆ రెండు జట్లూ ఎప్పుడూ పరస్పరం పోటీ పడతాయి. ఒక జట్టులో భయం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం, అహంకారం, ఆత్మన్యూనత ఉన్నాయి. రెండో జట్టులో ఆనందం, శాంతి, ప్రేమ, అణకువ, దయ, క్షమ, సత్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుందని ఉత్కంఠతో అడిగారు పిల్లలు. మీరు దేన్ని ప్రోత్సహిస్తే అది గెలుస్తుంది. గొప్పవారైన వాళ్లంతా రెండో జట్టును ప్రోత్సహించినవారే. రెండో జట్టును ప్రోత్సహిస్తే మీరూ గొప్పవారు కావచ్చు. ఈ కథ మాలో ఎంతోమందికి గమ్యాలు చేరుకోవడానికి... ఆయా రంగాల్లో రాణించి ముందుకెళ్లడానికి దిశానిర్దేశం చేసిందంటే అతిశయోక్తి కాదేమో!. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా గురువులు జీవించడానికి ఏం చేయాలో నేర్పడమే కాక, ఎలా జీవించాలో కూడా నేర్పాలన్న డాక్టర్ రాధాకృష్ణన్ మాటలు గుర్తుకు వస్తాయి.
భగవద్గీతలో కృష్ణుడు అంటాడు-
యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః
సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
ఉత్తములైన గురువులు ఏది ఆచరిస్తే ఇతరులు దాన్నే ఆచరిస్తారు. వారు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తే లోకమంతా దాన్నే స్వీకరిస్తుంది. ఒక పిల్లవాడి జీవితం తెల్లకాగితం లాంటిది. అతని జీవితంలో బోధించే ప్రతి గురువు ఏదో ఒకటి రాస్తారు. ఆ రాసే విషయం ఆ గురువు ఔన్నత్యం మీద ఆధారపడి ఉంటుంది. సోక్రటీస్ ఇందుకు గొప్ప ఉదాహరణ. తనను నిరంతర విద్యార్థిగా భావించుకున్న ఆయన జ్ఞాన వ్యాప్తికి తానొక మాధ్యమాన్నని, ఉత్ప్రేరకాన్ని మాత్రమేనని భావించేవారు. అందుకే ఆయన శిష్యులు ఆయన కంటే గొప్పవారయ్యారు. లేత వయసులో రాక్షస సంహారం కోసం రామలక్ష్మణుల్ని తనతో పంపమన్న విశ్వామిత్రుని విజ్ఞప్తిని అంగీకరించలేకపోయిన దశరథునితో వశిష్ట మహాముని... విశ్వామిత్రుని వంటి గురువు లభించటం ఎంతో అదృష్టమని చెబుతూ..
ఏష విగ్రహవాన్ ధర్మః ఏష వీర్యవతామ్ వరః
ఏష విద్యాధికో లోకే తపసః చ పరాయణమ్
ఈయన విగ్రహమే ధర్మానికి ప్రతిరూపం. వీరత్వంలో ఈయనకు వేరెవరూ సాటిలేరు. మేధస్సులో లోకంలో అందరినీ మించినవాడు. రుషుల్లో బ్రహ్మర్షి అని... దశరథునికి ఆ గురువు గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి చెబుతాడు. అలాంటి గొప్ప గురువు లభించబట్టే శ్రీరాముడు రఘుకులాన్వయ రత్నదీపమయ్యూడు. అలాంటి గురువులందరినీ స్మరించుకుంటూ.. ‘‘ఆచార్య దేవోభవ’’!!
‘‘జీతం పుచ్చుకోవటం వల్ల ఉపాధ్యాయులు సేవకులు అవుతున్నారు, వేతనం ఇస్తుండటం చేత విద్యార్థులు ప్రభువులవుతున్నారు’’ అని అన్న కందుకూరి మాటలు కూడా ఈ కాలం విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రులందరినీ ఆత్మావలోకనం చేసుకోవటానికి ప్రేరేపించేవే.
ప్రతి మనిషిలోనూ రెండు జట్లు ఉంటాయి. నాలోనూ, మీలోనూ కూడా ఉన్నాయి. ఆ రెండు జట్లూ ఎప్పుడూ పరస్పరం పోటీ పడతాయి. ఒక జట్టులో భయం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం, అహంకారం, ఆత్మన్యూనత ఉన్నాయి. రెండో జట్టులో ఆనందం, శాంతి, ప్రేమ, అణకువ, దయ, క్షమ, సత్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మీరు దేన్ని ప్రోత్సహిస్తే అది గెలుస్తుంది.

#Tags