Career with MBA: డిగ్రీ తర్వాత ఎక్కువ మంది చేరుతున్న కోర్సు.. కారణం ఇదే..
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ! తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఐసెట్‌లో ర్యాంకు ఆధారంగా... ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఇటీవల కాలంలో డిగ్రీ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కారణం.. మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకుంటే కార్పొరేట్ కొలువులు దక్కించుకోవచ్చనే భావన. ఎంబీఏ విద్యార్థులు ఇండస్ట్రీ పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. తొలిరోజు నుంచే రియల్ టైమ్ నైపుణ్యాల సాధనపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఎంబీఏతో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
- ఎంబీఏతో కార్పొరేట్ రంగంలో ఊరిస్తున్న కొలువులు
- రియల్ టైమ్ నైపుణ్యాలుంటేనే ఆఫర్లు ఇస్తున్న కంపెనీలు
- ప్రాక్టికాలిటీపై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు
ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో సరికొత్త కొలువులు పలకరిస్తున్నాయి. హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి సంప్రదాయ విభాగాలతోపాటు కన్సల్టింగ్, డేటా అనలిస్ట్, డేటా మేనేజర్స్, స్ట్రాటజీ మేనేజర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ రంగంలో.. బ్యాంకులతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించిన విభాగాల్లోనూ ఆఫీసర్స్/మేనేజర్స్ వంటి కొలువుల్లో చేరే అవకాశముంది. స్వచ్ఛంద సంస్థల్లో పాలసీ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
రియల్ టైమ్ నైపుణ్యాలు
- ఇలా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఊరిస్తున్న ఉద్యోగాలు సొంతం చేసుకోవాలంటే.. ఎంబీఏ విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. రియల్ టైమ్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని, ఇండస్ట్రీలో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఉద్యోగాల్లో.. ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ పూర్తి చేసిన వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అభ్యర్థుల్లో క్షేత్ర స్థాయి స్కిల్స్‌ను నిశితంగా పరిశీలించి.. తమ అవసరాలకు సరితూగుతారనుకుంటేనే ఆఫర్ ఇస్తున్నాయి.
- కన్సల్టింగ్ విభాగంలో.. కంపెనీల వ్యూహాలు, ప్రణాళికలకు సంబంధించి రీసెర్చ్, డేటా అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తమ క్లయింట్ సంస్థ అందిస్తున్న సేవలు, ప్రొడక్ట్‌లను ఇతర సంస్థలతో బేరీజు వేస్తూ విశ్లేషించి.. అంతకంటే మెరుగ్గా రాణించేందుకు అవసరమైన వ్యూహాలు రూపొందించే విధంగా కన్సల్టింగ్ జాబ్ ప్రొఫైల్స్ ఉంటున్నాయి.
చదవండి: ఐఐఎంల్లో గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వూ.. ప్రిపరేషన్ సాగించండిలా..
ఇంటర్న్‌షిప్స్
- ఎంబీఏ విద్యార్థులు రియల్ టైమ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ముఖ్యమైన మార్గం.. ఇంటర్న్‌షిప్స్. ఇందులో భాగంగా కోర్సు చదువుతున్నప్పుడే కొంత కాలం ఏదైనా సంస్థలో వాస్తవ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తారు. సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎస్‌పీఓ) పేరిట కార్పొరేట్ కంపెనీలు.. ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లో డ్రైవ్స్ నిర్వహిస్తూ.. ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తున్నాయి.
- స్థానిక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు.. తమ సీనియర్లు, ఆయా సంస్థల్లో పని చేస్తున్న వ్యక్తులతో పరిచయాల ద్వారా తమ నైపుణ్యాలకు సరితూగే కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- జాబ్ పోర్టల్స్‌లో తమ ప్రొఫైల్ అప్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుకోవచ్చు.
ప్రాక్టికల్ నాలెడ్జ్
ఎంబీఏ విద్యార్థులు అకడమిక్ నైపుణ్యాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించే విధంగా వ్యవహరించాలి. బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ఆపరేషన్స్ రీసెర్చ్ వరకూ.. అన్ని సబ్జెక్టులను ప్రాక్టికాలిటీతో చూడాలి. ఆయా విభాగాల్లో వాస్తవ పరిస్థితులు, తాజా మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం సదరు ఇన్‌స్టిట్యూట్‌లు, కార్పొరేట్ సంస్థల సమాఖ్యలు(సీఐఐ, ఫిక్కీ తదితర) నిర్వహించే సెమినార్లకు హాజరవ్వాలి. పలు రంగాల్లో మార్పులపై రూపొందించే తాజా నివేదికలను అధ్యయనం చేయాలి. తద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది.
చదవండి: జీఆర్‌ఈలేక జీమ్యాట్.. రెండింట్లో ఏది బెటర్..?
కేస్ స్టడీస్
- ఎంబీఏ విద్యార్థులు రియల్ టైమ్ నైపుణ్యాలు పొందేందుకు చక్కటి మార్గం.. కేస్ స్టడీస్. ఏదైనా ఒక సమస్యకు సంబంధించి నిపుణులు సూచించిన పరిష్కారాలుండే ఈ కేస్ స్టడీస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. నిర్దిష్ట కేస్ స్టడీ అనాలిసిస్ చేసే ముందు సమస్య ఏంటి.. దానికి నిపుణులు గుర్తించిన కారణాలు.. పరిష్కార మార్గాలు..తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
- కొన్ని సంస్థలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకొని.. తమకు ఏదైనా వ్యాపార సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం చూపమని కోరుతున్నాయి. ముఖ్యంగా ఐఐఎం, ఐఎస్‌బీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ విధానం అమలవుతోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు తాము పరిష్కారం కనుగొన్న సమస్యలతో కూడిన కేస్ స్టడీస్‌ను తమ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఇంటర్నెట్ ద్వారా వీటిని అధ్యయనం చేయొచ్చు.
ప్రాజెక్ట్ వర్క్
ఎంబీఏ విద్యార్థులు క్షేత్ర స్థాయి స్కిల్స్ పొందేందుకు మరో మార్గం.. అకడమిక్స్‌లో భాగమైన ప్రాజెక్ట్ వర్క్. తమ స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఇండస్ట్రీలోని తాజా పరిణామాలకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఫలితంగా రియల్ టైమ్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇది ఉద్యోగ ప్రపంచంలో ముందంజలో నిలిచేలా చేస్తుంది.
స్పెషలైజేషన్.. ఫోకస్
మేనేజ్‌మెంట్ పీజీ విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. ఎంబీఏ అంటే టక్కున గుర్తొచ్చే ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఓఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతోపాటు.. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు సరితూగేలా ఈ–బిజినెస్ మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ తదితర సరికొత్త స్పెషలైజేషన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్పెషలైజేషన్లను ఎంపిక చేసుకునే ముందు విద్యార్థులు తాము ఎంతవరకు సరితూగుతాము? అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
- జాబ్ సీకర్‌గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్‌గా మారి.. సొంత సంస్థలు నెలకొల్పాలనుకునే వారికి అందుబాటులోకి వస్తున్న విభాగం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్. ఈ స్పెషలైజేషన్ ద్వారా మార్కెటింగ్, సేల్స్, నెగోషియేషన్, మోటివేషన్, లీడర్‌షిప్, వెంచర్ ప్లానింగ్ వంటి నైపుణ్యాలు లభిస్తాయి.
- ఎంబీఏలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పెషలైజేషన్ కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో అధిక శాతం మంది సొంత సంస్థల ఏర్పాటు ఉద్దేశంతోనే చేరుతారు. వీరు ముందుగా కొంత అనుభవం గడించేందుకు ఉద్యోగాన్వేషణ చేస్తారు. అలాంటి వారు సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వైజర్‌గా చేరొచ్చు.
ఆ స్కిల్స్ ముఖ్యమే
- మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అకడమిక్స్, రియల్‌టైమ్ నైపుణ్యాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ అనాలిసిస్ వంటి నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి.
ఎంబీఏతో కెరీర్–ముఖ్యాంశాలు
- మేనేజ్‌మెంట్ విద్యార్థులకు విస్తృత కెరీర్ అవకాశాలు.
- డేటా మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్, ఎంటర్‌ప్రెన్యూర్ విభాగాల్లో కొలువులు
- ఎన్‌జీఓల్లో ప్లానింగ్ ఆఫీసర్స్, మేనేజర్స్ హోదాల్లో ఉద్యోగాలు
- రియల్ టైమ్ నైపుణ్యాలుంటే.. రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న కార్పొరేట్ సంస్థలు
భవిష్యత్ అవసరాలు
ఎంబీఏలో చేరే విద్యార్థులు రెండేళ్ల తర్వాత మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయో విశ్లేషించుకోవాలి. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తమ అకడమిక్ అభ్యసనానికి ప్రాక్టికాలిటీని అన్వయిస్తూ ముందుకు సాగాలి. అదే విధంగా సంస్థలు తాజాగా అందిస్తున్న జాబ్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలి. రియల్ టైమ్ నైపుణ్యాలు పొందేందుకు కృషిచేయాలి.
– ప్రొఫెసర్ వి.మేరీ జెస్సికా, డీన్, ఎస్‌ఎంఎస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
చదవండి: Management