జీఆర్‌ఈలేక జీమ్యాట్.. రెండింట్లో ఏది బెటర్..?
అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరేందుకు జీఆర్‌ఈ లేదా జీమ్యాట్ స్కోరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువమంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ‘జీఆర్‌ఈ’ రాస్తుండగా.. మరికొందరు ‘జీమ్యాట్’ను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ రెండు టెస్టులతో ప్రయోజనాలు.. పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...
ఒక కోర్సు.. రెండు ఎంట్రన్స్ లు
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు మేనేజ్‌మెంట్ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివారు దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)ల్లో చేరే ప్రయత్నం చేస్తుంటారు. వీరు క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్)కు హాజరవుతారు. అలాగే విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఎంబీఏలో చేరాలనుకుంటే.. గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(జీమ్యాట్), లేదా గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామి నేషన్(జీఆర్‌ఈ) స్కోరు తప్పనిసరి. భారతదేశం తోపాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని దాదాపు 1200 యూనివర్సిటీలు జీఆర్‌ఈని, మరో 2300 యూ నివర్సిటీలు జీమ్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాస్తవానికి జీఆర్‌ఈ/జీమ్యాట్ దేనికవే ప్రత్యేకమైన పరీక్షలు. బీస్కూల్స్.. జీమ్యాట్‌ను పరిగణనలోకి తీసుకుంటుండగా.. చాలా యూ వర్సి టీలు, ఇన్‌స్టిట్యూట్‌లు జీఆర్‌ఈ స్కోరుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.
ఎంఎస్‌కు జీఆర్‌ఈ..
మన దేశంలో ఇంజనీరింగ్ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి విదేశాల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేయాలని చాలామంది భారతీయ విద్యార్థులు కోరుకుంటారు. ఇవేకాకుండా ఇంగ్లిష్ ప్రధాన భాషగా ఉన్న దేశాల్లో ఎంఎస్ చేయాలంటే.. ‘జీఆర్‌ఈ’ స్కోరు తప్పనిసరి. జర్మనీలో కొన్ని యూనివర్సిటీలు సైతం ఎంఎస్‌లో ప్రవేశాల కోసం జీఆర్‌ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మన విద్యార్థులు ఎంఎస్ కోసం జీఆర్‌ఈని, ఎంబీఏ కోసం జీమ్యాట్‌ను ఎంచుకుంటున్నారు.
పరీక్ష విధానం..
- జీమ్యాట్, జీఆర్‌ఈ పరీక్షల విధానం, ప్రశ్నల తీరు వేర్వేరుగా ఉంటుంది. అంతేకాకుండా మార్కుల స్కోరు, నిర్వహణ, సమయం అన్నీ భిన్నమే! అయితే రెండు పరీక్షల స్కోరు ఐదేళ్లు మనుగడలో ఉంటుంది.
- జీఆర్‌ఈ: ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో 60 నిమిషాల పాటు అనలిటికల్ రైటింగ్ విభాగం ఉంటుంది. అనలైజ్ యాన్ ఇష్యూ, అనలైజ్ యాన్ ఆర్గ్యుమెంట్‌లపై ప్రతి వ్యాసానికి 30 నిమిషాల చొప్పున.. రెండు వ్యాసాలకు 60 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే వెర్బల్ రీజనింగ్‌పై రెండు విభాగాలు ఉంటే.. ఒక్కో సెక్షన్‌కు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ప్రతి సెక్షన్‌లో 20 ప్రశ్నలు ఉం టాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ రీజనింగ్‌పై రెండు విభాగాలు.. ప్రతి సెక్షన్‌కు 35 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. ప్రతి సెక్షన్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు. జీఆర్‌ఈ స్కోరు 260 నుంచి 340 ఉంటుంది. ఇందులో 329 స్కోరు సాధిస్తే ఉత్తమంగా చెప్పొచ్చు.
- జీమ్యాట్: ఇది మూడున్నర గంటల సమయంలో పూర్తి చేయాల్సిన పరీక్ష. ఇందులో అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్ విభాగంలో ఒక ప్రశ్న-30 నిమిషాలు; ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ విభాగంలో 12ప్రశ్నలు-30 నిమిషాలు; క్వాంటిటేటివ్ రీజనింగ్‌లో 31 ప్రశ్నలు- 62 నిమిషాలు; వెర్బల్ రీజనింగ్‌లో 36 ప్రశ్నలు-65 నిమిషాల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. రెండు పరీక్షలకు మధ్యలో కొంత బ్రేక్ ఇస్తారు. జీమ్యాట్‌లో 200 నుంచి 800 మధ్య స్కోరు ఉంటుంది. ఇందులో 700 కంటే ఎక్కువ స్కోరును ఉత్తమమైనదిగా చెప్పొచ్చు.
పరీక్ష విధానం- ఫీజు
జీఆర్‌ఈ సెక్షన్ ఎగ్జామ్‌ను కంప్యూటర్ అడాప్టివ్‌గా నిర్వహిస్తారు. కంప్యూటర్ ఎగ్జామ్‌కు అవకాశం లేని దేశాల్లో మాత్రమే పేపర్ వెర్షన్ ఎ గ్జామ్ ఉంటుంది. జీఆర్‌ఈ రిజిస్ట్రేషన్ ఫీజు 213 డాలర్లు లేదా రూ.15800 ఉంటుంది. ఇక జీమ్యాట్ పరీక్ష మాత్రం పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతంది. ఈ పరీక్ష ఫీజు 250 డాలర్లు అంటే సుమారు రూ.18700గా ఉంటుంది.
ఇంకా చదవండి: part 2: జీఆర్‌ఈ లేక జీమ్యాట్.. ఏ పరీక్ష సులభం తెలుసుకోండిలా..