Andhra pradesh govt jobs 2024: పశు సంవర్ధక శాఖలో 692 ఉద్యోగాలు

పశు సంవర్ధక శాఖలో కొలువుల జాతర జరుగుతోంది. సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పశు సంవర్ధక శాఖ పరిధిలో మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది.

ఉమ్మడి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు నెల రోజులుగా పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో నియామక పత్రాలు, ప్లేస్‌మెంట్లు ఇవ్వనున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వేదికగా పశు వైద్యం, పశు సంవర్ధక శాఖ తరఫున ప్రభుత్వ పథకాలు అమలు చేసి పాడి రైతులు, జీవాల కాపర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పశు సంవర్ధక సహాయకుల (వీఏహెచ్‌ఏ)ను నియమిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాకూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు 692 పోస్టులు కేటాయించారు. సచివాలయ వ్యవస్థ ప్రక్రియలో భాగంగా మూడేళ్ల కిందట మొదటి విడతగా 219 మంది వీఏహెచ్‌ఏలను నియమించారు. సంబంధిత కోర్సులు, విద్యార్హత లేని కారణంగా 473 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.

  • రెండేళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రెండేళ్ల కాలంలో సంబంధిత కోర్సు చేసిన 926 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత డిసెంబర్‌ 31న ఏడు కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో 150 మార్కులకు పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు 919 మంది హాజరయ్యారు. రోస్టర్‌, మెరిట్‌ ఆధారంగా డైరెక్టరేట్‌ పరిధిలో మొదటి విడతగా 206 మంది అభ్యర్థులు, రెండో విడతగా 240 మంది అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అర్హత పొందిన 446 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను నాలుగు నుంచి ఆరు బృందాలు మూడు రోజుల పాటు నిశితంగా పరిశీలించి 442 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేశారు.
  • ఎంతోకాలంలో ఎదురుచూస్తున్న వీఏహెచ్‌ఏ కొలువులు భర్తీ చేపట్టడంతో నిరుద్యోగ యువతతో పాటు గత 15 సంవత్సరాలు పశు సంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలు కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. గోపాలమిత్రలకు అదనంగా 15 మార్కులు కలపడంతో 70 మందికి పైగా గోపాలమిత్రలు ఇపుడు వీఏహెచ్‌ఏలుగా నియమితలవుతున్నారు. కొత్తగా పోస్టులు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీలు 90 మంది, బీసీలు 140 మంది ఉన్నారు. ఇందులో సగం మంది వరకు మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.

చదవండి: APPSC Polytechnic Lecturer Notification: ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకే విడతలో ఇంతమందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం శుభపరిణామం. డిగ్రీ, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న మాలాంటి యువతకు పశు శాఖలో కొలువులు కల్పిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. రాయదుర్గంలో వలంటీరుగా పనిచేస్తున్న నేను వీఏహెచ్‌ఏ పోస్టుకు ఎంపికవడం సంతోషంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తా.
– హెచ్‌.మంజుల, టి.వీరాపురం, రాయదుర్గం మండలం

#Tags