AP Intermediate 2024: నేడు ఇంటర్మీడియట్‌ పరీక్షలు మొదలు.. పకడ్బందీగా ఏర్పాట్లు..

నేడు.. శుక్రవారం ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు అన్ని విధాలుగా ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు, ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరాలను వెల్లడించారు బోర్డు అధికారులు..

అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు.

Jaganna Vidyadeevena: పేద విద్యార్థులకు 'జగనన్న విద్యా దీవెన' పథకం జారీ..

మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 60 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి, పరిశీలకుల హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.  పరీక్షలపై ఇంటర్‌ బోర్డు ‘డిజిటల్‌ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్‌’ కోడ్‌ను జోడించారు.

Junior Linemen (JLM) Jobs : విద్యుత్‌ శాఖలో 553 పోస్టులను మెరిట్‌ ప్రకారం వెంటనే భర్తీ చేయాలని హైకోర్ట్‌ ఆదేశం

పేపర్‌ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే గదులను కేటాయించడంతో పాటు వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచినట్టు ఇంటర్‌ విద్య కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. కాగా,  పరీక్షలు ముగిసేంత వరకు తాడేపల్లిలోని ఇంటర్‌ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్‌ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్‌ చేయొచ్చు. 

#Tags