Skip to main content

Junior Linemen (JLM) Jobs : విద్యుత్‌ శాఖలో 553 పోస్టులను మెరిట్‌ ప్రకారం వెంటనే భర్తీ చేయాలని హైకోర్ట్‌ ఆదేశం

Telangana High Court    Power Department vacancy  Vacancy Posts In Junior Linemen (JLM) Junior Linemen (JLM) Jobs   Telangana State Southern Power Distribution Company Limited

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్‌ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది.

ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ 2,500 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తిరుమలేశ్‌ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు జేఎల్‌ఎంలకు వర్తించవు:
జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్‌ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్‌ లోకల్‌ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు.

Published date : 01 Mar 2024 11:06AM

Photo Stories