Jagananna Vidya Deevena: పామర్రులో ‘విద్యా దీవెన’ కార్యక్రమం.. ఎప్పుడంటే..
ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా నగదు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమం కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పి.రాజాబాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), స్థానిక ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్‌లతో కలిసి సభా స్థలిని ఆదివారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలంలో ప్రస్తుతం చదును చేసే పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్యాలరీలుగా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
Jagananna Vidya Deevena: పేదింట విద్యా దీవెనలు
హెలి ప్యాడ్ నుంచి ఇలా..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక చల్లపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్ద దిగి, రోడ్డు షోగా సభా స్థలికి చేరుకుంటారని కలెక్టర్ వివరించారు. సీఎం వచ్చే రహదారికి ఇరువైపులా బారికేడ్‌లతో భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వాహనాల ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
అధికారులతో సమీక్ష..
సీఎం ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో పలు అంశాలను వివరించారు. విద్యా దీవెన గురించిన పూర్తి సమాచారాన్ని అధికారులు తమ దగ్గర ఉంచుకోవాలని ఆదేశించారు. సీఎం సభకు సమయం తక్కువగా ఉన్నందున అందరూ అధికారులు సమన్వయ పర్చుకుని సీఎం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తగు విధంగా కృషి చేయాలని అన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.