Skip to main content

Jagananna Vidya Deevena Funds Release: పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం కదులుతోంది: పామర్రులో సీఎం జగన్‌

సాక్షి,కృష్ణాజిల్లా: చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
Jaganmohan Reddy Speaking at Jagannath Ratham Event  cm ys jagan comments pamarru vidya deevena programme   Jaganmohan Reddy Promoting Education Equality through Jagannath Ratham

మార్చి 1న‌ కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి సీఎం జగన్‌ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ  పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన అని  తెలిపారు.

‘రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు  కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి  వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం.

చదవండి: Digital Education: దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందించాలి

గతంలో ఇంతే ఫీజులు కడుతాం.. ఇంత కంటే ఎక్కువ కట్టం.. మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్‌ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత  57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. 

Jagananna Vidya Deevena

57 నెలల్లో 29 లక్షల మందికి రూ.12 వేల కోట్లు..

అక్టోబర్‌,నవంబర్‌, డిసెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్‌లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా.

ఒక్క విద్యారంగంలో స్కీములకే ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ  57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం.

చదవండి: దక్షిణాఫ్రికాలో పాఠ్యపుస్తకంగా ‘తెలుగుబడి బాలవాచకం’

మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్‌. ఈ జనరేషన్‌ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి.  ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం.

ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా  గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్‌ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్‌, ఐబీ సిలబస్‌  తీసుకువచ్చాం.

Jagananna Vidya Deevena

ఇంగ్లీష్‌ మీడియం అంటే యుద్ధమే చేస్తున్నారు..

ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకు రావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్‌కళ్యాణ్‌తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారు. పెత్తందారులైన వారికో ధర్మమట.. మీకో ధర్మమట.. వారికో బడులట.. మనకో బడులట.. వారి పిల్లలకు ఒక చదువుట.. మనకు ఒక చదువులట.. పెత్తందారులు వారట.. పనివాళ్లం మనమట.. పరిశ్రమలు వారివట.. కార్మికులం మనమట.

వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు ఉండొచ్చు. పిల్లలకు జగన్‌  ట్యాబులిస్తే మాత్రం ఏవేవో చూస్తూ వారు చెడిపోతున్నారని యాగీ చేస్తారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యారంగంలో పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్‌ వార్‌ జరుగుతోంది. డబ్బులున్నవాళ్లకు, డబ్బు లేని వాళ్లకు ఒక యుద్ధం జరగుతోంది. మీ అన్నగా మీ తరపున విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ఈ అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పేదల పిల్లలు, పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి.

పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది..

చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసుకువచ్చాం. మూడవ తరగతిలోనే టోఫెల్‌ ఓరియెంటేషన్‌ కాన్సెప్ట్‌ తీసుకువచ్చాం. బై లింగ్విల్‌ టెక్స్ట్ బుక్స్‌ తీసుకువచ్చాం. బైజూస్‌ కంటెంట్‌ను పేద పిల్లకు అందించాం. పిల్లలు డిజిటల్‌ యుగాన్ని శాసించాలని 8వ తరగతిలోనే పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం.

నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నాం.

Jagananna Vidya Deevena

విదేశీ యూనివర్సిటీల్లో ఒక్కొక్కరికి రూ.కోటి 25 లక్షల ఫీజు.. 

ప్రపంచస్థాయిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల  మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ  లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చాం.

విదేశీ విద్యాలయాల వల్లే చదువులు చెప్పి వాల్లే సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పేదరికం సంకెళ్లను పేద పిల్లలు తెంచుకోవాలనే విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చాం. దీంతో వచ్చే పది పదేహేనేళ్లలో ఎంఎన్‌సీలలో ఉద్యోగాలు వచ్చి బతుకులు, తలరాతలు మారతాయి. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆయన చేసిన మంచి ఏమిటో చేయాలని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ బడికి చంద్రబాబు చేసిన మంచేమిటని అడిగితే ఎవరికీ ఏదీ గుర్తుకు రాదు. పేదపిల్లలు, వారి చదువుల కోసం చెబితే ఏదీ గుర్తుకు రాదు. ఆయన చేసిన చెడు మాత్రం గుర్తుకు వస్తుంది.

ప్రభుత్వ బడిని నీరుగార్చింది చంద్రబాబే..

ప్రభుత్వ బడిని నీరుగార్చించి చంద్రబాబునాయుడు. తన కార్పొరేట్‌ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబునాయుడు. పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో అనేదానిపై కనీసం ధ్యాస పెట్టిన పాపాన చంద్రబాబునాయుడు పోలేదు. నాడు,నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్‌ మీడియం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, కరిక్యులమ్‌లలో మార్పులు బాబు హయాంలో ఏవీ లేవు. 14 ఏళ్లు సీఎంగా చేసినపుడు రైతులకు, గ్రామాలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు చంద్రబాబు మంచి చేసిన పాపాన పోలేదు. ఈరోజు మారీచులతో మేం యుద్ధం చేస్తున్నాం.
జగన్‌ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంఘ్లీష్‌ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, ఉన్నతాధికారులు, కలెక్టర్‌ పాల్గొన్నారు.

Published date : 01 Mar 2024 06:01PM

Photo Stories