Women: వీటిలో అయితే పనిచేస్తాం.. మహిళల ఛాయిస్‌ ఇవే..

ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), టెలికం, ఈ-కామర్స్‌ రంగాల్లో కెరీర్‌ అవకాశాల పట్ల ఎక్కువ మంది మహిళా ఉద్యోగార్థులు సుముఖంగా ఉన్నారు. అలాగే మెజారిటీ మహిళలు ఇంటి నుంచి పనిచేసే అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ వివరాలను ఆప్నా డాట్‌ కో ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. కెరీర్‌లో సౌకర్యం, అంకిత భావానికి మధ్య సమతుల్యం ఉండాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు.

నైట్‌ షిఫ్ట్‌లలో 18 లక్షల మంది మహిళలు
అప్నా  డాట్‌ కో ప్లాట్‌ఫామ్‌పై మహిళల ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 18 లక్షల మంది మహిళలు రాత్రి షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని.. సవాళ్లను అంకిత భావంతో ఎదుర్కొనేందుకు వారు సంసిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అప్నా ప్లాట్‌ఫామ్‌పై 1.38 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉంటే, అందులో 67 లక్షల మంది టైర్‌–2 పట్టణాలకు చెందిన వారు. గతేడాదితో పోలిస్తే 33 శాతం మేర పెరిగారు.

చండీగఢ్, పాట్నా, లక్నో, అజ్మీర్, వదోదర పట్టణాల నుంచి సభ్యుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ పట్టణాలకు చెందిన మహిళా ఉద్యోగార్థులు ఎక్కువగా బిజినెస్‌ డెవలప్‌మెంట్, హెచ్‌ఆర్, బ్యాక్‌ ఆఫీస్, బోధన, కస్టమర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరగడం కేవలం జనాభాపరమైన మార్పు కంటే కూడా ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కుటుంబాల శ్రేయస్సు, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది’’అని అప్నా డాట్‌ కో వ్యవస్థాపకుడు, సీఈవో నిర్మిత్‌ పారిఖ్‌ తెలిపారు.

#Tags