Suspended fee Reimbursement:ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన నిలిపివేసిన కూటమి ప్రభుత్వం
అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి.
ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!
Also Read: AP DSC and TET Notification Details 2024 : నేడే టెట్-2024 నోటిఫికేషన్.. అలాగే డీఎస్సీ కూడా..!
పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?
రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు.
ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరం
ప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్‌లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చదువులపై బాధ్యత లేదా?
పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.
చెల్లింపులపై దుష్ప్రచారం..
ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు.
ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్‌కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ జమైంది.
మిగిలిన మొత్తంతో పాటు జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి
వసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు.
వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు.
ఉన్నత విద్యకు అడ్డంకి..
తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
– పి.శేఖర్, తిరుపతి