ChatGPT: ఒకే మెయిల్‌తో రూ.90 లక్షలు రాబట్టిన చాట్ జీపీటీ... ఆశ్చర్యపోతున్న టెక్ దిగ్గజాలు
తాజాగా మరో అడుగు ముందుకేసి ఓ వ్యక్తి తనకు రావాల్సిన మొండి బాకీని వసూలు చేసుకునేందుకు చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నాడు. ఇక రాదు అనుకున్న డబ్బును ఒక్క మెయిల్‌తో తిరిగి వచ్చేలా చేసి ఔరా అనిపించింది చాట్‌జీపీటీ.
చదవండి: వెనక్కి తగ్గిన గూగుల్... ప్రస్తుతానికి చాట్‌జీపీటీ దే రాజ్యం
ఒకే ఈ మెయిల్‌కు స్పందించిన క్లయింట్
గ్రెగ్ ఐసెన్‌బర్గ్‌కు ఒక డిజైన్ కంపెనీ ఉంది. దాని ద్వారా ఓ ప్రముఖ బ్రాండ్‌కు డిజైన్ వర్క్ చేసిచ్చారు. ఆ డిజైన్ వారికి బాగా నచ్చింది. అయితే దానికి వారి నుంచి డబ్బు రాలేదు. ఎన్ని మెయిల్స్ పంపినా స్పందన లేదు. ‘ఇక చేసేది ఏం లేక మా ఫైనాన్స్, ఆపరేషన్స్ టీం నన్ను రంగంలోకి దిగాలని కోరారు. ఇంకెన్ని మెయిల్స్ పంపినా ప్రయోజనం లేదనిపించింది. డబ్బు వసూలు కోసం ఖరీదైన లాయర్‌ను పెట్టుకోవడం కన్నా చాట్ జీపీటీ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. మా డబ్బు చెల్లించేలా ఆ క్లయింట్‌కు ఓ మెయిల్ రాసివ్వాలని చాట్‌జీపీటీని కోరగా అది చాలా చక్కగా రాసిచ్చింది. ఆ మెయిల్‌కు వెంటనే క్లయింట్ దగ్గర నుంచి స్పందన వచ్చింది. మీకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామని వారు బదులిచ్చారు’ అని ఐసెన్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
చదవండి: 20 నిమిషాల్లో 2 వేల పదాలతో ఎస్సే రాసి రికార్డ్..!
ఒక్క రూపాయి ఫీజు లేకుండా....
ఐసన్‌బర్గ్ చేసిన డిజైన్‌కు తన క్లయింట్ 1,09,500 డాలర్లు (రూ.90,80,331) ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ క్లయింట్ డిజైన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకోవడం ఐసన్‌బర్గ్ వంతైంది. క్లయింట్ నుంచి డబ్బులు రాబట్టుకోవడం కోసం మంచి లాయర్‌ను పెట్టుకుందామనుకున్నారు. కానీ, ఒకసారి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలనుకున్నాడు ఐసన్. దీంతో ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా క్లయింట్ నుంచి రావాల్సిన 1,09,500 డాలర్లు వచ్చేశాయి.