Loans to unemployed youth: నిరుద్యోగ యువతకు రుణాలు
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు డీసీసీబీ ద్వారా రాయితీపై రుణాలను అందించనున్నట్టు డీసీసీబీ డైరెక్టర్ చల్లా సత్యనారాయణమూర్తి అన్నారు. చౌడువాడ పీఏసీఎస్ వద్ద సంఘ అధ్యక్షుడు ఆకుల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులు తమతో పలువురికి ఉపాధిని కల్పించే పరిశ్రమను ఏర్పాటు చేసుకునే సమయంలో ప్రభుత్వం ద్వారా తమకు డీసీసీబీలకు దరఖాస్తును చేసుకుంటే రాయితీపై రుణం అందనున్నట్టు తెలిపారు.
రైతులకు తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలు అందిస్తామని, సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని పొందవచ్చని తెలిపారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ ద్వారా త్వరితగతిన రుణ వితరణ జరుగుతుందన్నారు. రైతుల పిల్లలకు విద్యా రుణాలు కూడా అందిస్తామన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, చోడవరం డీఎల్‌సీవో రాజశేఖర్, విద్యాశాఖాదికారి సోమేశ్వరరావు, డీసీసీబీ మేనేజర్ వన చంద్రరావు, పీఏసీఎస్ సీఈవో బత్తిన సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.