IT Crisis: తొలగింపుల్లోనూ పోటీ... ఆటంబాంబు పేల్చిన గూగుల్.. భారీగా తొలగింపులు
సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించినా సరే... ఇప్పుడు అవసరం లేదు అని భావిస్తే.. ‘‘రేపటి నుంచి ఉద్యోగానికి రాకండి’’ అని ముఖం మీదే చెప్పేస్తున్నాయి.
ఆర్థికమాంద్యం బూచిని చూపి...
ఆర్థిక మాంద్యం బూచిని చూపి ఇప్పటికే అమెజాన్ 10 వేల మంది ఉద్యోగులను పీకేసింది. అమెజాన్ కంటే తానేమీ తక్కువకాదు అన్నట్లు మైక్రోసాఫ్ట్ భావించినట్లుంది. ఆ సంస్థ 11 వేల మందిని ఇంటికి సాగనంపింది. తాజాగా గూగుల్ కూడా ఇదే బాటపట్టింది. మీ ఇద్దరి కంటే నేనేమీ తక్కువా... అనుకున్నాడేమే సుందర్ పిచాయ్.. ఏకంగా 12 వేల మందికి గుడ్ బై చెప్పేశాడు.
చదవండి: 11 వేలమందికి మైక్రోసాఫ్ట్ టాటా
ఇ మెయిల్‌లోనే ఊస్టింగ్ ఆర్డర్స్...
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు.
అమెరికా ఉద్యోగులపై వెంటనే ప్రభావం
రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్‌కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కోతలు ఉండబోతున్నాయని, అమెరికాలో సిబ్బందిపై వెంటనే ఈ ప్రభావం ఉండనుందని ఆల్ఫాబెట్ తెలిపింది. అయితే, తదుపరి ఉపాధి చూసుకునే వారికి సాయం అందిస్తామని తెలిపింది.
చదవండి: దినదినగండంలా ‘‘ఐటీ’’ ఉద్యోగాలు...!
60 రోజుల వేతనం...
అమెరికాలో ఉండే ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్ కాలానికి వేతనం చెల్లించనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్‌లో పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కు సంబంధించి బోనస్‌తో పాటు వెకేషన్ టైమ్, ఆరు నెలల పాటు హెల్త్ కేర్, జాబ్ ప్లేస్‌మెంట్ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఉన్న వారికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు.