Free training in electrical courses: ఎలక్ట్రికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: ఎలక్ట్రికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ పద్మజ అన్నారు. నాబార్డు సహకారంతో ఆర్‌కే టౌన్‌షిప్‌లోని జీఎంఆర్ వరలక్ష్మి ఉపాధి శిక్షణ కేంద్రంలో రెండు నెలల ఉచిత శిక్షణ తరగతులను గురువారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్ట్రికల్ నైపుణ్య శిక్షణ నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జీవితంలో ఒకరి మీద ఆధారపడకుండా తమంతట తాము బతకడానికి శిక్షణ తోడ్పడుతుందన్నారు. నాబార్డు సహకారంతో అందిస్తున్న శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నాబార్డు డీడీఎం టి.నాగార్జున మాట్లాడుతూ జీఎంఆర్ అందిస్తున్న వివిధ నైపుణ్య కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ జనరల్ మేనేజర్ కె.జయకుమార్, అసోసియేట్ మేనేజర్ సీహెచ్ నాగరాజు, సెంటర్ ఇన్‌చార్జి కె.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.