Success Story: అదరగొట్టిన ఏపీ విద్యార్థి... ఇంటెల్‌లో 1.2 కోట్ల ప్యాకేజీతో జాబ్
తమలా తమ బిడ్డలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు భావించారు. ఎంత కష్టం చేసైనా బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నారు. వారి కష్టానికి తోడు దేవుడి ఆశీస్సులు తోడవడంతో వారి కష్టాలు కాంపౌండ్ గేట్ దగ్గరే ఆగిపోనున్నాయి.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతూ...
ఆత్మకూరు యువకుడికి ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు. ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగం సాధించాడు.
ఆగస్ట్‌లో పోస్టింగ్...
ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్‌కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురవుతున్నారు.